Commerce | హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): డిగ్రీ కోర్సుల్లో కామర్స్ కోర్సుదే హవా సాగుతున్నది. డిగ్రీ ఫస్టియర్‌లో చేరేందుకు అత్యధికులు కామర్స్ వైపే మొగ్గుచూపుతున్నారు. ఈ విద్యాసంవత్సరం కామర్స్ కోర్సులో 28,655( 37.56శాతం) మంది విద్యార్థులు అడ్మిషన్ పొందారు. గత నాలుగైదు ఏండ్లుగా ఇదే ట్రెండ్ కొనసాగుతుండగా, ఈ సారి కూడా అదే పునరావృతమైంది.
డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్ )మొదటి విడత సీట్లను గురువారం కేటాయించారు. హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, విద్యామండలి చైర్మన్ లింబాద్రి ఆయా వివరాలను మీడియాకు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 886 డిగ్రీ కాలేజీల్లో 3,84,748 సీట్లుండగా, మొదటి విడతలో1,04,784 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకొన్నారు. వీరిలో 76,290 మంది విద్యార్థులు సీట్లు దక్కించుకొన్నారు.
62 శాతం అమ్మాయిలే..
తొలివిడతలో 47,867 (62.74శాతం) మంది అమ్మాయిలు సీట్లు దక్కించుకోగా, 28,423 (37.26 శాతం) మంది అబ్బాయిలు సీట్లు పొందారు. వీరిలోనూ కామర్స్ విద్యార్థులే ఎక్కువ మంది ఉండటం విశేషం. మొదటి విడతలో సీట్లు దక్కించుకొన్న 20 మంది టాపర్లలో ఒక్కరే అబ్బాయి ఉండగా, మిగిలినవారంతా అమ్మాయిలే ఉండటం గమనార్హం. సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 7 నుంచి 12 వరకు ఆన్లైన్ సెల్ఫ్‌రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సీటు పట్ల సంతృప్తిలేకపోతే సీటును రిజర్వుచేసుకుని, రెండో విడతలో కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు.
రెండో విడత రిజిస్ట్రేషన్లు ప్రారంభం
ఇదిలావుండగా, రెండో విడత దోస్త్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ గురువారం నుంచే ప్రారంభమైంది. ఈ ప్రక్రియను ఈ నెల 14 వరకు కొనసాగనున్నది. 18న రెండో విడత సీట్లను కేటాయిస్తారు.
70 కాలేజీల్లో జీరో అడ్మిషన్లు
దోస్త్ కింద మొత్తం డిగ్రీ కళాశాలలు (రెసిడెన్షియల్ మినహా) 886 ఉండగా, వీటిలో మొత్తం 546 కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ కాలేజీల్లో ఈ విద్యాసంవత్సరానికి మొత్తం 3,84,748 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఇప్పటి వరకు 76,290 సీట్లు భర్తీ కాగా, మిగిలిన సీట్లను రెండు, మూడు, తుది విడతల్లో భర్తీ చేయనున్నారు. విద్యార్థులకు సరిపడ సీట్లు ఉన్నట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి తెలిపారు. మొదటి విడత సీట్ల కేటాయింపులో జీరో అడ్మిషన్లు నమోదైన కాలేజీలు 70 ఉన్నాయి.
విద్యార్థుల సంఖ్య కంటే సీట్లు ఎక్కువ
విద్యార్థుల సంఖ్య కంటే సీట్లు ఎక్కువగా ఉన్నాయి. ఈసారి ఇంటర్ పాసైనవారు 2,83,530 మంది విద్యార్థులుంటే, డిగ్రీలో 3,84,748 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఉన్నత విద్యలో అమ్మాయిలు ఎక్కువగా రాణిస్తున్నారు. అమ్మాయిలు చదువుకుంటే కుటుంబం బాగుంటుందనే ఉద్దేశంతో విద్యార్థుల తల్లులు పిల్లలను ఉన్నత విద్యలో ప్రోత్సహిస్తున్నారు. ఇది శుభపరిణామం. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోలో జాతీయ సగటు కంటే విద్యలో మన రాష్ట్రం ముందున్నది. బుర్రా వెంకటేశం, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి
కోర్సుల వారీగా సీట్ల కేటాయింపు
కోర్సు : సీటు దక్కించుకొన్నవారు (శాతం)
కామర్స్ : 28,655 (37.56)
లైఫ్‌సైన్సెస్ : 15,301 (20.06)
ఫిజికల్ సైన్సెస్ : 14,964 (19.61)
ఆర్ట్స్ : 7,766 (10.18)
డాటాసైన్స్ : 2,502 (3.28)
డీ ఫార్మసీ : 90 (0.12)
ఇతరకోర్సులు : 7,012 (9.19)
మొత్తం : 76,290
మీడియం వారీగా సీట్ల వివరాలు
ఇంగ్లిష్ మీడియం : 72,431
తెలుగు మీడియం : 3314
హిందీ మీడియం : 05
ఉర్దూ మీడియం : 540