హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): 75వ బ్యాచ్ ఐపీఎస్‌లకు పాసింగ్ఔట్ (దీక్షాంత్) పరేడ్‌ను శుక్రవారం నిర్వహిస్తున్నట్టు హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ (ఎస్వీపీఎన్పీఏ) డైరెక్టర్ అమిత్‌గార్గ్ వెల్లడించారు. ఎస్వీపీఎన్పీఏలో పాసింగ్ఔట్ పరేడ్ వివరాలను బుధవారం ఆయన మీడియాకు తెలిపారు. 27నాటి దీక్షాంత్ పరేడ్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, ఇతర సీనియర్ ఐపీఎస్ అధికారులు హాజరవుతారని చెప్పారు. 75వ బ్యాచ్‌లో మొత్తం 175 మంది ఆఫీసర్ ట్రైనీలకు శిక్షణ ఇచ్చినట్టు తెలిపారు. వీరిలో 155 మంది మన దేశానికి చెందినవారు కాగా, 20 మంది విదేశీ ట్రైనీలు ఉన్నారని చెప్పారు. వారిలో పురుషులు 123, మహిళలు 32 మంది ఉన్నట్టు తెలిపారు.
ఎప్పటిలాగే ఈసారి కూడా ఇంజినీరింగ్ చదివినవారే అధికంగా 102 మంది ఉన్నారని తెలిపారు. ఇండోర్, ఔట్‌డోర్ విభాగాల్లో ప్రతిభ కనబర్చిన ఆరుగురు ట్రైనీ ఐపీఎస్‌లను అమిత్‌గార్గ్ అభినందించారు. ఈసారి తెలంగాణ క్యాడర్‌కు 9 మంది ట్రైనీ ఐపీఎస్‌లను కేటాయించినట్టు తెలిపారు. వీరిలో తెలంగాణకు చెందిన నలుగురు ఉండగా.. ఇతర రాష్ర్టాలకు చెందినవారు ఐదుగురు ఉన్నారు. 2022 బ్యాచ్‌లో తెలంగాణ నుంచి ఐదుగురు ఎంపిక కాగా, నలుగురిని రాష్ట్ర క్యాడర్‌కు, ఒకరిని వేరే రాష్ర్టానికి కేటాయించారు. తెలంగాణకు కేటాయించినవారిలో బీ చైతన్యరెడ్డి, పీ మౌనిక, కే రాహుల్‌రెడ్డి, ఎస్ చిత్తరంజన్, శుభమన్ నగరాలె, కాజల్, రాజేశ్ మీనన్, విక్రాంత్‌కుమార్‌సింగ్, చేతన్ మీనన్ ఉన్నారు.
నా కల నేరవేరింది. ప్రజలకు స ర్వీస్ చేయడమే మి గిలి ఉంది. ఎన్ఐటీ వరంగల్‌లో బీటెక్ చేసిన తర్వాత ఇరిగేషన్‌శాఖలో ఐదేండ్లు పనిచేశా. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు ఐపీఎస్‌కు చదువుకునే దాన్ని. అలా నాలుగో ప్రయత్నంలో సివిల్స్ సాధించాను. నాన్న గ్రూప్-1 ఆఫీసర్.
– బొక్కా చైతన్యరెడ్డి, వరంగల్
హైదరాబాద్‌లోనే పుట్టిపెరిగాను. పోలీస్ సర్వీసెస్ అంటే ప్యాషన్‌గా మారింది. నాన్న బీడీఎల్‌లో ఏజీఎం. చదువంతా హైదరాబాద్‌లోనే సాగింది. నాలుగో ప్రయత్నంలో నా లక్ష్యం నెరవేర్చుకున్నాను. ట్రైనింగ్ చాలా కఠినం. మొదట్లో కిలోమీటర్ ఉరకగలమా? అనే సందేహం ఉండేది. ఇప్పుడు 15 కిలోమీటర్లు అవలీలగా పరుగెత్తగలం.
– పీ మౌనిక, చంపాపేట్
మాది హైదరాబాద్‌లోని అల్వా ల్. నాన్న రిటైర్డ్ న్యాయమూర్తి. ఆయన ఆశయాలు చాలా గొప్పవి. ఆయన నుంచే స్ఫూర్తి పొంది ఐపీఎస్ కావాలనుకున్న. ఇన్‌కంట్యాక్స్ డిప్యూటీ కమిషనర్‌గా కొన్నాళ్లు చేశాను. తీరిక సమయాల్లో చదివి చివరికి నాన్న కల నెరవేర్చాను.
– ఎస్ చిత్తరంజన్, అల్వాల్