నిజామాబాద్, జూన్ 26 (నమస్తేతెలంగాణ ప్రతినిధి): జాతీయ పసుపుబోర్డు ఒక్కటే అయినా పలుమార్లు ప్రారంభోత్సవం చేస్తుండటం చర్చనీయాంశమైంది. ఈ ఏడాది జనవరి 14న నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు హోటల్లో జాతీయ పసుపుబోర్డు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఢిల్లీ నుంచి కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, ఎంపీ అర్వింద్ వర్చువల్‌గా బోర్డును ప్రారంభించారు. అప్పటివరకు ఉన్నటువంటి స్పైసెస్ బోర్డు ఎక్స్టెన్షన్ కార్యాలయాన్ని తాత్కాలిక జాతీయ పసుపు బోర్డు కార్యాలయంగా మార్చారు. ఆర్నెళ్లుగా కిరాయి భవనంలోనే కొనసాగుతున్న ఈ కార్యాలయానికి త్వరలోనే శాశ్వత భవనం నిర్మిస్తారని అంతా ఊహించారు. ఏమైందో ఏమో కానీ ఉన్నట్టుండి మళ్లీ పసుపుబోర్డు ప్రారంభోత్సవానికి తెర లేపారు.
ఇందుకోసం మరో భవనాన్ని అద్దెకు తీసుకున్నారు. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ ఆధీనంలోని 4,052 చదరపు అడుగుల విస్తీర్ణంలోని బిల్డింగ్‌ను నెలకు రూ.52,676 చొప్పున అద్దె ఒప్పందంతో జాతీయపసుపు బోర్డు స్వాధీనం చేసుకున్నది. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయమే జాతీయ పసుపుబోర్డు తాత్కాలిక కార్యాలయానికి ఉపయుక్తం కానుంది. ప్రస్తుత రూరల్ ఎమ్మెల్యే ఈ క్యాంప్ ఆఫీస్‌ను వాడకపోవడంతో పసుపుబోర్డుకు అద్దె ప్రాతిపదికన రాష్ట్ర సర్కారు అప్పగించింది. ఈ తాత్కాలిక కార్యాలయాన్ని ప్రారంభించేందుకు ఈనెల 29న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రానుండటం చర్చనీయాంశమైంది. 2020లో స్పైసెస్ బోర్డు విస్తరణ కార్యాలయం, ఈ ఏడాది జనవరి 14న ప్రైవేటు హోటల్లో జాతీయ పసుపుబోర్డు స్థాపన, తాజాగా ఈనెల 29న తాత్కాలిక కార్యాలయం ప్రారంభోత్సవాలతోనే ఇలా కాలం గడుపుతుండటం రైతులను విస్మయానికి గురిచేస్తున్నది.
హోం మంత్రి పర్యటనలో.. ఎంపీ ధర్మపురి అర్వింద్ తండ్రి, మాజీ మంత్రి డీ శ్రీనివాస్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేయడంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఊహ తెలిసిన నాటి నుంచి కాంగ్రెస్‌లో పనిచేసిన డీఎస్ అంచెలంచెలుగా ఎదిగి పీసీసీ చీఫ్‌గా, మంత్రిగా పనిచేశారు. జీవిత చరమాంకంలో కాంగ్రెస్‌లో పొసగలేక బయటకు వచ్చారు. ఈ సమయంలోనే చేరదీసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఆయన రాజకీయ అనుభవానికి తగినట్టుగా రాజ్యసభ సీటు ఇచ్చి గౌరవించారు. ఈ సమయంలోనే డీఎస్‌తో పాటు ఆయన ఇద్దరు కొడుకులు మూడు పార్టీల్లో కొద్దికాలం కొనసాగారు.
కాంగ్రెస్‌లో పెద్ద కుమారుడు సంజయ్, చిన్న కుమారుడు ధర్మపురి అర్వింద్ బీజేపీ ఎంపీగా ఉన్నారు. ఏమైందో కానీ కేసీఆర్ పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేస్తూ డీఎస్ బీఆర్ఎస్ను వీడారు. అనారోగ్యంతో డీఎస్ ఉన్న సమయంలోనే కాంగ్రెస్‌లో చేరినట్టు పెద్ద కొడుకు ప్రకటన చేయడం, దాన్ని ఎంపీ అర్వింద్ ఖండించడం ప్రకంపనలు రేపింది. ఈనెల 29 నాటికి డీఎస్ మరణించి ఏడాది పూర్తవుతున్నందున ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానుండటం విస్తుగొల్పుతున్నది.