గుమ్మడిదల, ఫిబ్రవరి 16: సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం ప్యారానగర్లో డం పింగ్ యార్డు ఏర్పాటును వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ కొంతకాలంగా ఆందోళనలు ఉధృతంగా సాగుతున్నాయి. ఆదివారం కూడా నిరసనలు చేపట్టారు. గుమ్మడిదలలో రైతు జేఏసీ కమిటీ అధ్యక్షుడు చిమ్ముల జైపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో అఖిపక్ష నాయకులు, రైతు సంఘాలు, మహిళా సంఘాల సభ్యులు జాతీయ రహదారి-765డీపై భారీ ర్యాలీ నిర్వహించారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినా పనులు చేపట్టడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
డంపింగ్ యార్డు వద్దకు మహిళలు ర్యాలీగా వెళ్లారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అక్కడికి చేరుకుని వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులతో నిరసనకారులకు మధ్య తోపులాట జరిగింది.‘జై జవాన్.. జై కిసాన్, సేవ్ ఫారెస్ట్, సేవ్ ఫార్మర్’ నినాదాలు మిన్నంటాయి. మహిళలు డంపింగ్ యార్డు వైపు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు.
డంపింగ్ యార్డు ఏర్పాటు అనుమతులను వెంటనే రద్దు చేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనకు మద్దతు ప్రకటించిన సందర్భంగా ఆమె మాట్లాడారు. భూసర్వే చేసే వరకు పనులు నిలిపి వేయాలని హైకోర్టు ఆదేశించిన విషయాన్ని గుర్తుచేశారు. డంపింగ్ యార్డు పనులు జరుగుతున్నాయా? లేక నిలిపివేశారా? అనే విషయంలో నిర్మాణ సంస్థ రాంకీ స్పష్టత ఇవ్వాలని, ఆందోళన చేస్తున్నవారికి డంపింగ్ యార్డు పనులు ఆపింది లేనిది చూపించాల్సిన బాధ్యత లేదా అని ప్రశ్నించారు.
డంపింగ్ యార్డులోకి అనుమతించక పోవడంపై పలు అనుమానాలు, అపోహలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. 12 రోజులుగా పనులు వదులుకుని నల్లవల్లి, కొత్తపల్లి, ప్యారానగర్, గుమ్మడిదల, దోమడుగు, బొంతపల్లి తదితర గ్రామాల ప్రజలు ఆందోళనలు చేస్తున్నా, ప్రభుత్వం స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం జీహెచ్ఎంసీ అధికారులతో చర్చించి డంపింగ్‌యార్డు అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. డంపింగ్ యార్డు చెత్త కంపుతో పచ్చని పల్లెల్లో పర్యావరణానికి విఘాతం కలుగుతుందని, భూగర్భ జలాలను, అడవులను, పంటలను నాశనం చేయొద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా ఆదివారం జాతీయ రహదారిపై యువకులు పెద్దసంఖ్యలో బైక్ ర్యాలీ నిర్వహించారు. గుమ్మడిదల నుంచి అన్నారం, ప్రకృతి నివాస్ వరకు బైక్ ర్యాలీ చేపట్టారు. నల్లవల్లి, కొత్తపల్లిలో రిలే నిరాహార దీక్షలు 12వ రోజుకు చేరాయి. దోమడుగు, బొంతపల్లి గ్రామాల జేఏసీల ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే డంపింగ్‌యార్డు అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.