హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ): తెలంగాణవాసికి అమెరికాలోని ప్రతిష్ఠాత్మక అవార్డు లభించింది. వర్జీనియాలో ఉంటున్న బోయినపల్లి అనిల్ ఇండియన్ అమెరికన్ 2024 స్మాల్ బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యారు. యునైటెడ్ స్టేట్స్ స్మాల్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎస్బీఏ) నేషనల్ స్మాల్ బిజినెస్ వీక్ (ఎన్ఎస్బీడబ్ల్యూ) అవార్డు-2024 గ్రహీతలను ప్రకటించింది. ఇందులో బోయినపల్లి అనిల్‌కు చోటు దక్కింది.
దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి తోడ్పడిన వ్యాపారవేత్తకు ఈ అవార్డును ప్రదానం చేస్తారు. స్కై సొల్యూషన్స్ సంస్థ సహ వ్యవస్థాపకుడు, సీఈవోగా ఉన్న అనిల్ వర్జీనియా రాష్ట్రం నుంచి ఈ అవార్డుకు ఎంపికయ్యారు. వర్జీనియాకు చెందిన హెర్న్‌డాన్ కంపెనీతో కలిసి 2008లో స్కై సొల్యూషన్స్ సంస్థను అనిల్ ఏర్పాటుచేశారు. ఇది వ్యాపార సంబంధమైన అంశాల్లో సాంకేతిక పరిష్కారాలను అందించడంతోపాటు సంక్లిష్ట విధానాలను సరళీకృతం చేసే సేవలను అందిస్తుంది.
కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసిన అనిల్ కొంతకాలం సీఎన్ఎస్ఐ సంస్థలో ఆర్కిటెక్ట్‌గా హెల్త్‌కేర్ పరిశ్రమలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ విధులు నిర్వర్తించారు. అంతకుముందు ఫెన్నీ మే, హారిస్ కార్పొరేషన్లో కూడా పనిచేశారు. ఎన్ఎస్బీడబ్ల్యూ అవార్డుల ప్రదానోత్సవం ఏప్రిల్ 28, 29 తేదీల్లో వాషింగ్టన్ డీసీలోని వాల్డోర్స్ ఆస్టోరియా హోటల్లో జరగనున్నది.
ఎస్బీఏ అడ్మినిస్ట్రేటర్, అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ క్యాబినెట్లో సభ్యుడైన ఇసాబెల్ కాసిల్లాస్ గుల్మాన్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని అవార్డులను ప్రదానం చేస్తారు. దక్షిణ భారతదేశంలోని మారుమూల గ్రామం నుంచి వచ్చిన తనకు ఈ అవార్డు లభించడం ఆనందంగా ఉందని అనిల్ పేర్కొన్నారు. అమెరికా వంటి గొప్ప దేశంలో ఇలాంటి ఆదరణ లభించడం అద్భుత విజయని ఆయన చెప్పారు.