హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ) : వేల కోట్లు పెట్టుబడులను స్వాగతిస్తూ.. అనేకానేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, కంపెనీలకు నెలవుగా ఉన్న హైదరాబాద్ ఇప్పుడు అమెరికన్ స్కూళ్లను ఆకర్షిస్తున్నది. ఇప్పటికే గూగుల్, అమెజాన్ వంటి సంస్థలు హైదరాబాద్‌కు తరలిరాగా, తాజాగా ఓ ఆమెరికన్ స్కూల్ హైదరాబాద్‌లో ఏర్పాటైంది. గచ్చిబౌలిలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఏర్పాటుచేసిన సఫారీకిడ్ ప్రీ స్కూల్, డేకేర్ సెంటర్‌ను పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని బుధవారం ప్రారంభించారు. సఫారీకిడ్ ప్రీస్కూల్‌ను 2005లో సిలికన్ వ్యాలీలో తీసుకొచ్చారు. ఆ తర్వాత అమెరికా, కెనడా వరకు విస్తరించిన ఈ స్కూల్ ఇప్పుడు మన దేశంలోని హైదరాబాద్‌లో పాఠశాలను నెలకొల్పింది. వచ్చే విద్యాసంవత్సరం వరకు దేశంలోని 10 ప్రముఖ పట్టణాల్లో ఈ స్కూల్‌ను నెలకొల్పుతామని సఫారీకిడ్ ఇండియా చైర్మన్ జితేంద్ర కర్సన్ తెలిపారు.