‘మా బతుకును నాశనం చేస్తున్నరు. కేసీఆర్ సారూ.. ఈ అన్యాయాన్ని చూడు. మమ్మల్మి మీరే కాపాడాలి’ అంటూ తల్లీ కొడుకు వేడుకుంటున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో అందరినీ కదలించింది. కాప్రా మున్సిపాలిటీలో సోమవారం అధికారులు పలు నిర్మాణాలను, దుకాణాలను కూల్చేశారు. తమ చెప్పుల దుకాణాన్ని కూల్చవద్దంటూ ఓ తల్లీకొడుకు అధికారుల కాళ్లావేళ్లా పడ్డారు.
HYDRAA | హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 23(నమస్తే తెలంగాణ): ఆక్రమణలపై పాదరసంలా కదిలే హైడ్రా పేదలపైనే ప్రతాపం చూపుతున్నదని మరోసారి నిరూపితమైంది. బడాబాబుల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదని తేటతెల్లమైంది. మరీ ముఖ్యంగా సర్కారు అండదండలు ఉండే పెద్దల నిర్మాణాల విషయంలో మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నది. పేదల నిర్మాణాలకు ఇలా నోటీసులిచ్చి అలా కూల్చేస్తున్న హైడ్రా.. కావాల్సిన వాళ్లకు మాత్రం కావాల్సినంత సమయం ఇస్తున్నది. వారు తీరిగ్గా కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకునే వరకు తీరుబడిగా ఎదురుచూస్తున్నది. దుర్గం చెరువు పరీవాహక ప్రాంతంలో పదుల ఎకరాల్లో విస్తరించిన అమర్ హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ విషయంలో హైడ్రా వ్యవహరించిన తీరు ఇప్పుడు సరికొత్త చర్చకు కారణమైంది. ఈ సొసైటీకి నెలన్నర క్రితమే నోటీసులిచ్చిన హైడ్రా ఇప్పటి వరకు అటువైపు పొరపాటున కూడా కన్నెత్తి చూడలేదు. ఆ సొసైటీలో నోటీసులు అందుకున్న వారిలో సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడి ఉండడమే అందుకు కారణమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదేమో! ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలోని నిర్మాణాలకు ఆగస్టు 8న అధికారులు హడావుడిగా నోటీసులు జారీచేసి చేతులు దులుపుకొన్నారు. ఈ నోటీసులపై సొసైటీ హైకోర్టును ఆశ్రయించింది. ఎఫ్టీఎల్ విషయంలో తమకు అభ్యంతరాలు ఉన్నాయని, అది తేలేవరకు కూల్చివేతలు కూడదని న్యాయస్థానం తాజాగా తీర్పు ఇవ్వడంతో వారంతా హైడ్రా బుల్డోజర్ల నుంచి సేఫ్‌గా బయటపడ్డారు.
హైడ్రా దూకుడుకు కళ్లెం
అన్ని చెరువుల్లానే దుర్గం చెరువు కూడా అన్యాక్రాంతమైంది. ఈ చెరువు పరీవాహక ప్రాంతంలోనే అమర్ కోఆపరేటివ్ సొసైటీ ఉంది. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలోని ప్రాంతాలను పూడ్చివేసి దశాబ్దం క్రితమే ఇక్కడ కాలనీలు, రెసిడెన్షియల్ ప్రాజెక్టులు నిర్మించారు. దీనికే గత నెలలో హైడ్రా అధికారులు నోటీసులు జారీచేశారు. ఈ నోటీసులపై స్థానికులు అభ్యంతరాలను లేవనెత్తారు. చెరువు ఎఫ్టీఎల్ నిర్ధారణ అయ్యే వరకు కూల్చివేతలు చేపట్టవద్దని హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా విచారణ ప్రారంభించిన న్యాయస్థానం వారికి అనుకూలంగా తీర్పునిస్తూ హైడ్రా దూకుడుకు కళ్లెం వేసింది. ఈ విషయంలో హెచ్ఎండీఏ ప్రిలిమినరీ నోటిఫికేషన్లో ఉన్న పూర్తి విస్తీర్ణంలో అమర్ కోఆపటివ్ సోసైటీకి ఉన్న అభ్యంతరాలను చర్చించుకోవాలని తెలిపింది. ఆ తర్వాతే దుర్గం చెరువు పరీవాహాక ప్రాంతంలో కూల్చివేతలపై నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఆరు వారాల్లోపు ఎఫ్టీఎల్ పరిధిని నిర్ధారించాలని ఆదేశించింది. దీంతో అప్పటి వరకు అక్కడ ఎలాంటి కూల్చివేతలు చేపట్టబోమని కోర్టుకు జీహెచ్ఎంసీ స్పష్టం చేసింది.
మొదటి నుంచీ వివాదాస్పదమే
అక్రమ నిర్మాణాల విషయంలో హైడ్రా తీరు మొదటి నుంచి వివాదస్పదంగానే ఉన్నది. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతోనే కూల్చివేతలకు ప్రణాళికలు రూపొందిస్తున్నారనే వాదన బలపడేలా వ్యవహరిస్తున్నది. అమర్ కోఆపరేటివ్ సొసైటీ విషయంలోనూ ఆయన ఆదేశాలనే హైడ్రా పాటిస్తున్నదని తేలింది. ఆ సొసైటీకి ఆగస్టులోనే నోటీసులు జారీచేసినా కూల్చివేతల విషయంలో సాధారణంగా చేసే హడావుడి చేయలేదు. దీంతో వారు హైకోర్టును ఆశ్రయించడం.. తాజాగా వారికి తీర్పు అనుకూలంగా రావడం జరిగిపోయింది. కోర్టు తీర్పుతో రేవంత్ సోదరుడు ప్రస్తుతానికి సేఫ్‌గానే బయపడినట్టు లెక్క.
హైడ్రా కొరడా సామాన్యుడిపైనే
చెరువులు, కుంటలను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చివేయడమే లక్ష్యంగా పనిచేస్తున్న హైడ్రా సామాన్యుడు నిర్మించుకున్న ఇండ్లపైనే కొరడా ఝళిపిస్తున్నది. పేద, మధ్యతరగతి ప్రజలు నిర్మించుకునే ఇండ్లను కూల్చివేస్తున్నది. బిల్డర్లు, డెవలపర్లు చేసిన తప్పిదాలకు సామాన్యుల గూడు కూలిపోతున్నది. అదే సమయంలో రాజకీయ పలుకుబడితో చెరువులను అన్యాక్రాంతం చేసిన సంపన్నులను టచ్ చేసేందుకు కూడా సాహసించడం లేదు. ఎన్ కన్వెన్షన్ లాంటి నిర్మాణాలను కూల్చివేసినా, నల్లచెరువు పరివాహాక ప్రాంతంలో ఉన్న నిర్మాణాలకు నోటీసులిచ్చిన ఏడు రోజుల్లోనే బుల్డోజర్లను ఎగదోసిన హైడ్రా కమిషనర్ అమర్ కో ఆపరేటివ్ సోసైటీ విషయంలో ఆచితూచి అడుగులు వేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ సొసైటీలో సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడి ఇల్లు ఉండడమే అందుకు కారణమని చెప్తున్నారు. ఈ కారణంగానే ఆగస్టులో నోటీసులు ఇచ్చి, వారు హైకోర్టును ఆశ్రయించి, విచారణ జరిగి, స్టే వచ్చేంత సమయం వరకు ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేశారని అంటున్నారు.