హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 13(నమస్తే తెలంగాణ) : దేశంలోని పలు ప్రాంతాల్లో ఉన్న యురేనియం నిక్షేపాలను అన్వేషించేందుకు ఎన్జీఆర్ఐ సంస్థ కృషి చేయనున్నది. ఈ మేరకు అటమిక్ మినరల్ డైరెక్టరేట్ (ఏఎండీ)తో ఒప్పందం కుదుర్చుకొన్నది. ఈ ఒప్పందం ప్రకారం.. దేశవ్యాప్తంగా భార లోహ నిక్షేపాలను అన్వేషించేందుకు అధునాతన టెక్నాలజీ హెలిబోర్న్ ఆధారంగా సర్వే చేపట్టనున్నారు. ఎన్జీఆర్ఐ డైరెక్టర్ డాక్టర్ ప్రకాశ్ కుమార్, ఏఎండీ డైరెక్టర్ ధీరజ్ పాండే ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. దేశ పురోగతికి శక్తి వనరుల ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని పేర్కొన్నారు. న్యూక్లియర్ ఎనర్జీ కార్యక్రమానికి ఇదొక కీలక మలుపు అవుతుందని, ఖనిజ అన్వేషణను విస్తృతం చేయడంలోనూ ఈ ఒప్పందం సహకరిస్తుందని తెలిపారు.