Ambedkar Photo on Notes | హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): రాజ్యాంగ పరిరక్షణకు యావత్ ప్రజానీకం మరో పోరాటానికి సిద్ధం కావాలని కరెన్సీపై అంబేదర్ ఫొటో సాధన సమితి (సీఏపీఎస్ఎస్) జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జేరిపోతుల పరశురామ్ పిలుపునిచ్చారు. సీఏపీఎస్ఎస్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద మంగళవారం రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పరశురామ్ మాట్లాడుతూ అంబేదర్ లేకుంటే భారత రాజ్యాంగమే లేదని తెలిపారు. రాజ్యాంగం ద్వారానే దేశంలోని పౌరులందరూ సమాన హకులు పొందుతున్నారని పేర్కొన్నారు. అయినా, గణతంత్ర దినోత్సవాల్లో అంబేదర్ చిత్రపటాన్ని పెట్టకపోవడం, ఆర్బీఐ స్ఫూర్తి ప్రదాత అంబేదర్ ఫొటోనూ కరెన్సీ నోట్లపై ముద్రించకపోవడం చరిత్రను వక్రీకరించడమేనని తెలిపారు. ప్రస్తుత పాలకులు రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నారని, రాజ్యాంగ పరిరక్షణకు మరో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఏపీఎస్ఎస్ సాంసృతిక విభాగం జాతీయ కన్వీనర్ సంజీవ, శ్రీను, చంద్రహస్, సునీల్ తదితరులు పాల్గొన్నారు.