హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ) : దళిత వర్గాల సుదీర్ఘ స్వప్నం త్వరలో నెరవేరనున్నది. రాష్ట్ర హైకోర్టు ప్రాంగణంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటుచేసేందుకు హైకోర్టు చీఫ్ జస్టిస్ట్ అపరేశ్‌కుమార్ హామీ ఇచ్చినట్టు న్యాయవాదుల బృందం తెలిపింది. మంగళవారం చీఫ్ జస్టిస్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపిన దళిత న్యాయవాదులతో చీఫ్ జస్టిస్ అపరేశ్‌కుమార్ తన ఆనందాన్ని పంచుకున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రెండేండ్ల క్రితమే హైకోర్టు ప్రాంగణంలో అంబేదర్ విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ జరిగినా.. కొన్ని కారణాలతో ఆ కార్యక్రమం రూపుదాల్చలేదని తెలిపారు. చీఫ్ జస్టిస్ హామీతో నవంబర్‌లో జరిగే రాజ్యాంగ దినోత్సవం నాటికి అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు మార్గం సుగమమైనట్టు చెప్పారు. కార్యక్రమంలో అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ మాదిగ కన్వీనర్ దున్న అంబేదర్, గౌరవ అధ్యక్షుడు ఇనుగాల భీమారావు, శ్రీలత, పారిజాత, రామకృష్ణ, సుమిత్ర, యాదీశ్వర్ పాల్గొన్నారు.