ములుగు, ఏప్రిల్ 14(నమస్తేతెలంగాణ) : ములుగు జిల్లాలో సోమవారం అధికారికంగా జరిగిన బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుక రసాభాసగా మారింది. వేడుకలను అవమానాల మధ్య జరిపారని, కలెక్టర్‌తోపాటు జిల్లాస్థాయి అధికారులు రాకపోవడం, సభ ఏర్పాటు చేయకపోవడంపై దళిత సంఘాల నాయకులు నిరసనకు దిగారు. ములుగు కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ సంపత్‌రావు ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించిన వేడుకకు దళిత సంఘాలతోపాటు ప్రజా సంఘాల నాయకులు, విద్యార్థులు హాజరయ్యారు.
సభా వేదికపై సరిపడా కుర్చీలు లేకపోవడం, సమావేశ మందిరం అప్పటికే నిండిపోవడంతో దళిత సంఘాలు, ఇతర నాయకులను అధికారులు లోపలికి అనుమతించలేదు. దీంతో దళిత సంఘాల నాయకులు ఇరుగు పైడి, జన్ను రవి, బుర్రి సతీశ్, నక్క భిక్షపతి, కోగిల మహేశ్, కొట్టెపాక ప్రభాకర్, చంటి భద్రయ్య, మడిపెల్లి శ్యాంబాబు, ప్రజా సంఘాల నాయకుడు ముంజాల భిక్షపతిగౌడ్ మండిపడ్డారు. పదిరోజుల ముందు నుంచే కలెక్టర్‌ను కలిసి సభ ఏర్పాటు చేసి వేడుకలను నిర్వహించాలని చెప్పామని, అయినా కలెక్టర్ పట్టించుకోలేదని ఆరోపించారు. ఈ వేడుకకు కలెక్టర్‌తోపాటు ఎస్పీ, మరో అదనపు కలెక్టర్, ఆర్డీవో, డీఎస్పీ, ఇతర శాఖల అధికారులు రాకపోవడం అంబేద్కర్‌ను అవమానించడమేనని తెలిపారు.