కమలాపూర్, జూన్ 5 : ఇందిరమ్మ ఇండ్లు ఇయ్యకపోతే మందుతాగి చస్తామని పురుగుల మందు డబ్బాలతో పలువురు నిరసనకు దిగారు. ఈ ఘటన గురువారం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం అంబాల గ్రామంలో చోటుచేసుకున్నది. అంబాల గ్రామంలో భూభారతి చట్టంపై అధికారులు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.
అక్కడికి వచ్చిన అదే గ్రామానికి చెందిన కుక్కల చిరంజీవి, బోయిని జానకితోపాటు మరికొందరు వచ్చి.. ‘ఇందిరమ్మ ఇండ్లు ఉన్నోళ్లకే ఇస్తున్నరు.. గుంట భూమిలేని పేదలకు ఇస్తలేరు. మాకు ఇందిరమ్మ ఇండ్లు ఇయ్యకుంటే చస్తాం’ అని వెంట తెచ్చుకున్న పురుగుల మందు డబ్బాలతో నిరసనకు దిగారు.
వ్యవసాయ భూములున్న వారి పేర్లు ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో వచ్చాయని, పేదల పేర్లు రాలేదని వారు మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు వారికి అనుకూలంగా ఉన్నోళ్ల పేర్లు మాత్రమే జాబితాలో పెట్టారని ఆరోపించారు. భూ భారతిపై అవగాహన కల్పించేందుకు వచ్చిన కాంగ్రెస్ నాయకులు, అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో అధికారులు భూభారతి కార్యక్రమాన్ని ముగించుకొని వెళ్లిపోయారు.