(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): ఓటు హక్కు ఉందంటే, జీవించి ఉన్నామని అర్థం. అందుకే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు ఎంత ముఖ్యమో.. ఓటర్ల జాబితా ఇప్పుడు అంతకంటే ముఖ్యంగా తయారైంది. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియపై సర్వత్రా చర్చ జరుగుతున్నది. ‘సర్’ సవరణ సమయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా ఓటరు ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉన్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఓటరు హోదా కోల్పోతే, ఎన్నికల్లో ఓటు హక్కుకు దూరమవ్వడమే కాదు ప్రభుత్వ పథకాలు కూడా అందే అవకాశం లేదని గుర్తు చేస్తున్నారు. ఇక, ‘సర్’ ప్రక్రియపై ఆశ్రద్ధగా ఉంటే రాజకీయ పార్టీలకు కూడా పెను నష్టం తప్పదని హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు బెంగాల్, తమిళనాడులో ఇటీవల జరిగిన ఉదంతాలను గుర్తు చేస్తున్నారు. గత మే నాటికి దేశవ్యాప్తంగా 12 రాష్ర్టాల్లో నిర్వహించిన ‘సర్’లో 7.85 కోట్ల ఓట్లను తొలగించినట్టు వార్తలు వస్తున్నాయి.
అత్యధికంగా యూపీలో 2.04 కోట్ల ఓట్లను (13.21 శాతం) తొలగించగా, బెంగాల్లో 91 లక్షల ఓట్లను (10.9 శాతం), తమిళనాడులో 97 లక్షలు (10.6 శాతం) ఓట్లను తొలగించారు. ‘సర్’పై అనుమానాలు, పత్రాలను నింపడంలో ఎదురవుతున్న సందేహాలతో రాష్ట్రంలో కొందరు ఈ ప్రక్రియపై పెద్దగా ఆసక్తి కనబర్చట్లేదని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో ‘సర్’ ప్రక్రియలో పౌరులందరూ పాల్గొనాలని, తద్వారా తమ ఓటు హక్కు కోల్పోకుండా జాగ్రత్త పడాలని నిపుణులు సూచిస్తున్నారు. ఓటు హక్కు కోల్పోతే ఎన్నికల్లో ఓటేయడానికి దూరమవ్వడమే కాదు.. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, పోస్టాఫీసుల్లో గుర్తింపునకు అవసరమైన కీలకమైన పత్రాన్ని కూడా కోల్పోతామని చెప్తున్నారు. పాస్‌పోర్ట్, ఆధార్, పాన్‌కార్డు వంటి పత్రాల దరఖాస్తుల సమయంలో ఓటరు ఐడీ ప్రాముఖ్యతను గుర్తు చేస్తున్నారు. ఇక, సిమ్ కార్డ్ దరఖాస్తు, వెరిఫికేషన్‌కు, దేశంలో ప్రయాణాలకు, కేవైసీ (నో యువర్ కస్టమర్)కు ఓటర్ ఐడీని ప్రథమ ఆధారంగా తీసుకొంటున్నట్టు చెప్తున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా.. ప్రభుత్వ పథకాల అమలులో ఓటర్ ఐడీ ఎంతో కీలకంగా ఉన్నదని, ఓటు హక్కు కోల్పోతే.. ఆ స్కీమ్‌లు ఆగిపోయే ప్రమాదమున్నదని చెప్తున్నారు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని.. ‘సర్’ ప్రక్రియలో ఓటర్లందరూ అప్రమత్తతతో ఉండి, తమ ఓటు హక్కు కోల్పోకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని మేధావులు సూచిస్తున్నారు.
ఓటు పోయింది.. పాస్‌పోర్టు ఆగింది
పశ్చిమ బెంగాల్లో నిర్వహించిన ‘సర్’ ప్రక్రియలో తన పేరును ఓటర్ల జాబితా నుండి తొలగించడంతో తన పాస్‌పోర్ట్ పునరుద్ధరణ (రెన్యువల్) నిలిచిపోయిందని ది టెలిగ్రాఫ్ వార్తాపత్రిక మాజీ ఎడిటర్ ఆర్ రాజగోపాల్ తెలిపారు. ఈ క్రమంలో నిపుణులు ప్రజలకు కీలక సూచనలు చేస్తున్నారు. ‘సర్’ ప్రక్రియలో ఇచ్చే ఎన్యుమరేషర్ ఫారాల్లో 2002 నాటి ఓటర్ల జాబితాలోని వివరాలను సరిగ్గా నమోదు చేయాలని సూచిస్తున్నారు. వివరాలు తెలియకపోతే, సంబంధిత అధికారుల సాయాన్ని తీసుకోవాలని చెప్తున్నారు.
ఓటు పోతే పథకాలకు రాంరాం
“సర్’లో ఓటు కోల్పోతే, ప్రభుత్వ పథకాలు రావా?’ కర్ణాటక సీఎం డీకే శివకుమార్ ఇటీవల చేసిన హెచ్చరికలు ఇప్పుడు ప్రజల్లో ఓటు ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాయి. కర్ణాటకలో ‘సర్’ ప్రక్రియ మంగళవారం ప్రారంభమైన నేపథ్యంలో డీకే శివకుమార్ కీలక హెచ్చరిక చేశారు. ఓటరు జాబితాలో పేరు లేకపోతే కేవలం ఓటు హక్కే కాకుండా, భవిష్యత్తులో ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు కూడా కోల్పోయే పరిస్థితి రావచ్చని ఆయన హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ తమ పేరు ఓటరు జాబితాలో ఉందో లేదో తప్పనిసరిగా పరిశీలించాలి. ఓటు హక్కు కోల్పోతే ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు కూడా కోల్పోయే అవకాశం ఉంది’ అని శివకుమార్ పేర్కొన్నారు.
బెంగాల్లో దీదీకి ‘సర్’ షాక్
‘సర్’ను నిర్లక్ష్యం చేస్తే, ప్రజలకే కాదు రాజకీయ పార్టీలకు కూడా తీవ్ర నష్టం జరిగే అవకాశమున్నదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ‘సర్’ పేరిట బెంగాల్లో 91 లక్షల ఓటర్లను తొలగించారు. దీంతో బెంగాల్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ పార్టీ టీఎంసీ ఓటు బ్యాంకు భారీగా గల్లంతయ్యింది. ‘సర్’ ప్రక్రియలో ఓట్లు తొలగించిన నియోజకవర్గాల్లో బీజేపీ భారీగా లాభపడినట్టు గణాంకాలను బట్టి అర్థమవుతున్నది. ‘సర్’ ప్రక్రియలో 5 వేల ఓట్లు తొలగించిన 13 నియోజకవర్గాలన్నింటినీ బీజేపీ గెలుచుకొంది. 5-15 వేల మధ్య ఓట్లను తొలగించిన క్యాటగిరీలో 50 స్థానాలు, 15-25+ వేల ఓట్ల మధ్య డిలీట్ చేసిన క్యాటగిరీలో ఏకంగా 142 సీట్లను బీజేపీ గెలుచుకొన్నది. టీఎంసీకి సానుభూతిగా ఉన్న మైనారిటీ ఓట్లను భారీగా తొలగించడమే బీజేపీ గెలుపునకు ప్రధాన కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా ‘సర్’ ప్రక్రియలోని డిలీషన్తో 5.04 శాతం ఓట్ల తేడాతో టీఎంసీని ఓడించి బీజేపీ.. 207 సీట్లు గెలుచుకొంది.
నిర్లక్ష్యం ఖరీదు ఎంతంటే?
‘సర్’ ప్రక్రియపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే తమిళనాడులో డీఎంకే అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ‘సర్’ పేరిట తమిళనాడులో 97.3 లక్షల ఓట్లను ఇటీవల తొలగించారు. గత ఎన్నికల్లో 133 సీట్లను గెలుచుకొన్న స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే పార్టీ ఇటీవలి ఎన్నికల్లో 74 స్థానాలకు పరిమితమయ్యింది. గత స్టాలిన్ ప్రభుత్వ మంత్రివర్గంలోని 32 మంది మంత్రుల్లో 15 మంది మంత్రులు ఓడిపోవడానికి ‘సర్’లో తొలగించిన 5-10 వేల ఓట్లే కారణమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
తెలంగాణలో ‘సర్’ షెడ్యూల్
తెలంగాణ ఓటర్లు ఇలా..
మొత్తం ఓటర్లు: 3,38,26,448
ఇప్పటివరకూ ఓటర్ల మ్యాపింగ్: 2.49 కోట్లు
పాల్గొంటున్నది వీరే