హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): కర్ణాటక, మహారాష్ట్రతోపాటు, రాష్ట్రంలోనూ ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో శుక్రవారం వరకు ఉప్పొంగిన ప్రాణహిత శనివారం శాంతించింది. మేడిగడ్డ వద్ద 5.66 లక్షల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతుండగా, సమ్మక్కసాగర్ వద్ద 7.58 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. కృష్ణమ్మలో వరద క్రమంగా పెరుగుతున్నది. జూరాలకు 1.78 లక్ష క్యూసెక్కులు వస్తుండగా, శ్రీశైలం ప్రాజెక్టుకు 1.28 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
ఉప్పొంగిన పెన్‌గంగ
సిర్పూర్(టీ), ఆగస్టు 1 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా మాకిడి, హుడ్కులీ, వెంకట్రావ్‌పేట్, టోంకిని, పారిగాం, లోనవెల్లి గ్రామాల మీదుగా ప్రవహిస్తున్న పెన్‌గంగ శనివారం ఉగ్రరూపం దాల్చడంతో తెలంగాణ-మహారాష్ట్రకు రాకపోకలు నిలిచిపోయాయి. హుడ్కులీ లోలెవల్ వంతెన పెన్‌గంగ బ్యాక్ వాటర్‌తో మునిగిపోయింది. సిర్పూర్(టీ)- హుడ్కులీ గ్రామం మీదుగా మహారాష్ట్ర (రాజురా) వైపు రాకపోకలు నిలిచిపోయాయి.
భద్రాచలం వద్ద వరద తగ్గుముఖం
భద్రాచలం, ఆగస్టు 1: భద్రాచలం వద్ద మూడ్రోజులపాటు ఏజెన్సీ ప్రాంత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసిన ఉగ్ర గోదావరి శాంతిస్తున్నది. వరద ప్రభావంతో ఏపీలోని విజయవాడ- ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్పూర్ జాతీయ రహదారిని భద్రాచలం వద్ద మూసివేశారు. భద్రాచలం మీదుగా ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఒడిశాకు వెళ్లే వాహనాలన్నీ భద్రాచలంలోనే నిలిచిపోయాయి. భద్రాచలం వద్ద శనివారం 50 అడుగులు దాటి ప్రవహిస్తున్నది. ఇక మరోవైపు శబరి, ఇంద్రావతి నుంచి భారీగా వరద వచ్చి చేరుతుండటంతో సీతమ్మసాగర్ వద్ద వరద గోదావరిలో 15.25 లక్షల ప్రవాహం క్రమంగా పెరుగుతున్నది.
