నాంపల్లి క్రిమినల్ కోర్టులు, జనవరి 4 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద ఇటీవల తొక్కిసలాట జరిగి ఓ మహిళ మృతిచెందిన కేసులో టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ నాంపల్లిలోని 9వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో శుక్రవారం ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు కావడంతో శనివారం మధ్యాహ్నం దాదాపు 3 గంటల సమయంలో కోర్టుకు చేరుకుని, రూ.50 వేల చొప్పున ఇద్దరి పూచీకత్తులను సమర్పించారు. అల్లు అర్జున్ సంతకం చేసిన పర్సనల్ బాండ్‌ను ఆయన తరఫు న్యాయవాది అశోక్‌రెడ్డి కోర్టుకు సమర్పించారు. అనంతరం అల్లు అర్జున్ కోర్టులో సంతకం చేసి తిరిగి వెళ్లిపోయారు. ఆయన రాక సందర్భంగా నాంపల్లి కోర్టుల ప్రాంగణంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.