హైదరాబాద్ సిటీబ్యూరో/చిక్కడ్పలి/బంజారాహిల్స్ /బన్సీలాల్‌పేట్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ ): ఈ నెల 4న పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో ప్రముఖ సినీ హీరో అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. కాగా పక్కా ప్రణాళికతోనే ఆయన అరెస్ట్‌ను చకచకా చేసేశారని తెలుస్తున్నది. అరెస్ట్ చేసిన తర్వాత రిమాండ్ రిపోర్టు సిద్ధం చేయాల్సి ఉండగా, అర్జున్ విషయంలో రిమాండ్ రిపోర్టు అంతా సిద్ధం చేసిన తర్వాతే అరెస్ట్ చేశారని తెలిసిం ది. శుక్రవారం అరెస్ట్ చేస్తే శని, ఆదివారాల్లో ఎ ట్టి పరిస్థితుల్లోనూ జైలులో ఉంచొచ్చనే ప్లాన్ వేసినట్టు స్పష్టమవుతున్నది. పుష్ప-2 ప్రీమియర్ షోకు ఈ నెల 4న ప్రభుత్వం అనుమతిచ్చింది. సంధ్య థియేటర్లో ప్రదర్శించిన ఈ షోకు భారీ సంఖ్యలో ప్రేక్షకులు హాజరయ్యారు. సినిమాకు అల్లు అర్జున్ కుటుంబ సమేతంగా వ చ్చారు. అభిమానులు భారీ సంఖ్యలో తరలిరావడం, తొక్కిసలాట చోటుచేసుకోవడంతో రేవతి అనే మహిళ చనిపోయింది. ఆమె కొడుకు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఘటనపై మృతురాలి భర్త మగడంపల్లి భాస్కర్ చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బీఎన్ఎస్ 105, 118(1) రెడ్ విత్ 3, 5 సెక్షన్ల కింద కేసు నమో దు చేశారు. 8న థియేటర్‌కు చెందిన ఇద్దరు యజమానులతో పాటు మేనేజర్‌ను అరెస్ట్ చేయగా తాజాగా అల్లు అర్జున్ను అరెస్ట్ చేశారు.
తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని కో రుతూ రెండు రోజుల క్రితమే అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఒక వేళ పిటిషన్‌ను పరిగణలోకి తీసుకొని క్వాష్ చేస్తే అల్లు అర్జున్ను అరెస్ట్ చేయలేమని పోలీసులు భావించినట్టు తెలుస్తున్నది. శుక్రవారం అరెస్ట్ చేస్తే బెయిల్ రావడం కష్టమని, దాంతో తప్పని సరి గా అల్లు అర్జున్ను జైల్లో పెట్టొచ్చని ప్లాన్ వేశారన్న చర్చ జరుగుతున్నది. అనుకున్నదే తడవు గా ఉన్నతాధికారుల నుంచి అనుమతి తీసుకొని శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని అల్లు అర్జున్ నివా సం చుట్టూ స్థానిక పోలీసులు మోహరించారు. రోడ్ నెం 45 నుంచి వచ్చే దారితో పాటు రోడ్ నెం 1 వైపు రాకపోకలపై నిఘా పెట్టిన జూబ్లీహి ల్స్ పోలీసులు, అల్లు అర్జున్ ఇంట్లోనే ఉన్న విషయాన్ని నిర్ధారించుకున్న తర్వాత చిక్కడపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఉదయం 11.45 గంటలకు చిక్కడపల్లి ఏసీపీ రమేశ్, ఇన్స్పెక్టర్ రాజు నాయక్ తమ సిబ్బందితో అల్లు అర్జున్ ఇంట్లోకి దూసుకెళ్లారు. ఆ సమయంలో అల్లు అర్జున్ స్విమ్మింగ్ పూల్‌లో ఉన్నారు. ఆయన వద్దకు వెళ్లి అరెస్ట్ చేస్తున్నామంటూ తెలపడంతో షాక్‌కు గురయిన అర్జున్, తేరుకొని బట్టలు వేసుకొని వస్తానంటూ రెండో అంతస్థు లో ఉన్న తన గదికి వెళ్లారు. రెండు మూడు నిమిషాలు వేచి చూసిన పోలీసులు నేరుగా బెడ్ రూమ్వద్దకు వెళ్లారు. ఇంతలోనే అర్జున్ బయటకు వచ్చారు. ‘అరెస్ట్ చేయడం ఒకే, కానీ ఇలా బెడ్రూమ్ దాకా రావడమేంటి? నేను పారిపోను..
మీతోనే వస్తా’నంటూ పోలీసుల ప్రవర్తనపై అసహనం వ్యక్తం చేశారు. ఇంతలోనే అర్జున్ తండ్రి అరవింద్ వచ్చి తాము హైకోర్టులో పిటిషన్ వేశామని, తీర్పు రాకముందే అరెస్టేమిటని ప్రశ్నించారు. తమకు పిటిషన్‌తో సంబంధం లేదని చెప్పిన పోలీసులు అర్జున్ను పై అంతస్థు నుంచి కిందకు తీసుకొచ్చారు. అంతకుముందే బయటకు వెళ్లిన ఆయన భార్య స్నేహారెడ్డి ఇంటి కి వచ్చేదాకా వేచిఉన్నారు. విషయం తెలిసి ఆ మె కన్నీళ్లు పెట్టుకోవడంతో అర్జున్ ఆమెకు, తన తండ్రికి ధైర్యం చెప్తూ పోలీసు వాహనంలో ఎక్కారు. మధ్యాహ్నం 1గంటకు చిక్కడపల్లి పో లీస్‌స్టేషన్‌కు వెళ్లారు. రిమాండ్ రిపోర్టుతో సిద్ధం గా ఉన్న పోలీసులు వైద్య పరీక్షల కోసం గాంధీ దవాఖానకు మధ్యాహ్నం 2 గంటలకు తీసుకెళ్లారు. వైద్య పరీక్షల తర్వాత మధ్యాహ్నం 3 గంటల వరకు నాంపల్లి కోర్టుకు తరలించి జడ్జి ముందు హాజరు పరిచారు. అప్పటికే అల్లు అర్జున్‌పై నమోదైన కేసును కొట్టేయాలని, ఆయనకు 105, 118(1)సెక్షన్లు వర్తించవని ఆయన తరఫు న్యాయవాదులు హైకోర్టులో వాదనలు వినిపించారు. ఓవైపు హైకోర్టులో వాదనలు కొ నసాగుతుండగానే సాయంత్రం 5 గంటల ప్రాం తంలో నాంపల్లి కోర్టు అల్లు అర్జున్‌కు 14 రోజు ల రిమాండ్ విధిస్తూ తీర్పు వెల్లడించింది. దీం తో వెంటనే పోలీసులు ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు. చంచల్‌గూడ జైల్లోకి వెళ్లగానే హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది.
అల్లు అర్జున్ అరెస్ట్‌పై ఫిర్యాదుదారు భాస్కర్ స్పందించాడు. ‘నా కొడుకు సినిమా చూస్తానంటేనే ఆ రోజు సంధ్య ధియేటర్‌కు వెళ్లినం. అక్కడ అల్లు అర్జున్ తప్పేమీ లేదు. అవసరమైతే నేను కేసు విత్ డ్రా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నా.. ఆయనను అరెస్ట్ చేసిన విషయాన్ని కూడా పోలీసులు నాకు చెప్పలేదు’ అని వివరించాడు.
అర్జున్ అరెస్టు వార్త తెలిసి ఆయన అభిమానులు భారీ సంఖ్యలో చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్, గాంధీ, నాంపల్లి కోర్టు, చంచల్‌గూడ జైలు వద్దకు తరలివచ్చారు. ఒక్కోచోటుకు అల్లు అర్జు న్ మారుతుండడంతో అభిమానులతో ఆయా రూట్లలో ట్రాఫిక్ తీవ్రంగా పెరిగింది.
విషయం తెలియగానే హీరో చిరంజీవి, సురేఖ దంపతులు హుటాహుటిన అల్లు అర్జున్ నివాసానికి చేరుకున్నారు. ఆయన కుటుంబసభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. కాసేపటికి నాగబాబు, ఇతర కుటుంబసభ్యులు కూడా వచ్చారు. సినీ ప్రముఖులు, బంధువులు పెద్ద సంఖ్యలో రావడం కనిపించింది.