బంజారాహిల్స్, డిసెంబర్ 14: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్టయిన అల్లు అర్జున్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో శనివారం ఉద యం 6.15 గంటలకు జైలు నుంచి విడుదలయ్యారు. శుక్రవారం సాయంత్రమే హైకోర్టు బెయిల్ ఇచ్చినా ఆర్డర్ కాపీ సకాలంలో తమకు చేరలేదంటూ చంచల్‌గూ డ జైలు అధికారులు అల్లు అర్జున్ను విడుదల చేయలేదు. శనివారం ఉదయం విడుదలైన బన్నీ నేరుగా జూబ్లీహిల్స్ రోడ్ నెం 45లోని గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు.
గంటపాటు అక్కడే ఉన్న ఆయ న, తన కేసు వాదించిన న్యాయవాదుల బృందంతో చర్చించారు. ఆయన ఇంటికి వెళ్లగానే కొడుకు అయాన్, భార్య స్నేహారెడ్డి, కుమార్తె ఆర్హ పరుగున వచ్చి ఆలింగనాలు చేసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తనకు మద్దతిచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. కేసు కోర్టులో ఉన్నందున తాను ఏమీ మాట్లాడబోనని, చట్టాన్ని గౌరవించే వ్యక్తిని అని పేర్కొన్నారు.
20 ఏండ్లుగా అనేక సార్లు అభిమానులతో కలిసి సినిమాలు చూసానని ఏనాడూ జరగని దుర్ఘటన పుష్ప -2 ప్రీమియర్‌షోలో జరగడం బాధ కలిగించిందని, ఘటనలో మృతి చెందిన రేవతి కుటుంబానికి అండగా ఉంటామని పేర్కొన్నారు. అల్లు అర్జున్ విడుదల విషయం తెలిసి సినీ ప్రముఖులు ఆయన ఇంటికి తరలివచ్చారు. దర్శకులు సుకుమార్, వంశీ పైడిపల్లి, త్రివిక్రమ్, రాఘవేంద్రరావు, కొరటాల శివ, నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవి, దిల్‌రాజు, నటులు విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, రాణా దగ్గుబాటి, నాగచైతన్య, ఆర్ నారాయణమూర్తి, పలువురు సినీ ప్రముఖులు అల్లు అర్జున్ ఇంటికి వచ్చి పరామర్శించారు.