హైదరాబాద్ సిటీబ్యూరో/ముషీరాబాద్, డిసెంబర్ 24: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ మంగళవారం హైదరాబాద్ చిక్కడపల్లి పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. పోలీసుల నోటీసులకు స్పందించిన ఆయన మంగళవారం ఉదయం 11 గంటలకు న్యాయవాదితో కలిసి స్టేషన్‌కు వెళ్లారు. జుబ్లీహిల్స్‌లోని అల్లు ఇంటి వద్ద, చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్ పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటుచేశారు. సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష్ యాదవ్, ఏసీపీ రమేశ్, ఇన్స్పెక్టర్ రాజునాయక్ విచారణ నిర్వహించారు. 4న పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో 11వ నిందితుడిగా ఉన్న అల్లు అర్జున్ను పోలీసులు 13న అగమేఘాలపై అరెస్ట్ చేశారు. రిమాండ్ రిపోర్టు తయారుచేసిన తర్వాత అల్లు అర్జున్ను హడావుడిగా అరెస్ట్ చేసి, గాంధీ దవాఖానలో వైద్య పరీక్షలు నిర్వహించి, కోర్టులో సరెండర్ చేసిన అనంతరం అతడిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఇంతలోనే హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో 13న రాత్రి జైల్లో ఉన్న అల్లు అర్జున్, మరుసటిరోజు ఉదయం జైలు నుంచి బయటకొచ్చారు. రిమాండ్ రిపోర్టు ఆధారంగా ఈ విచారణలో పలు ప్రశ్నలను పోలీసులు అల్లు అర్జున్ను అడిగినట్టు సమాచారం.
తొక్కిసలాట ఘటనకు ముందు, తర్వాత చోటుచేసుకున్న పరిణామాలపై పోలీసులు త యారుచేసిన 10 నిమిషాల వీడియోను అల్లు అర్జున్‌కు చూపించారు. పలు రకాల ప్రశ్నలను అల్లు అర్జున్‌పై సంధించినట్లు సమాచారం. ‘పోలీసుల నుంచి అనుమతి లేకుండా మీరెలా వచ్చారు? రద్దీ ఎక్కువగా ఉన్నది. మిమ్మల్ని రావద్దని చెప్పాలంటూ థియేటర్ యాజమాన్యానికి కూడా చెప్పాం. మీరు పోలీసుల ఆదేశాలను ఎందుకు పాటించలేదు’ అని పోలీసు లు ప్రశ్నించినట్టు తెలిసింది. ‘బౌన్సర్లు వీరం గం చేశారు. పోలీసులను కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. మీ బౌన్సర్లు, మీ నిర్లక్ష్యం కారణంగానే ఘోరం జరిగిందని స్పష్టమవుతుంది. దీనికి మీరెమంటారు?’ అంటూ ప్రశ్న ల వర్షం కురిపించినట్టు తెలిసింది. తొక్కిసలా ట జరిగిందని మీకు చెప్పే ప్రయత్నం చేశాం, ముందు మీ మేనేజర్ సంతోశ్‌కు చెప్పినా ప్రయోజనం లేక నేరుగా మీకే చెప్పాం.. మీరు సినిమా పూర్తిగా చూసి వెళ్తానంటూ భీష్మించా రు. డీసీపీ వచ్చి మిమ్మల్ని బయటకు తీసికెళ్లా రు. మీరు అసలు తొక్కిసలాట, మహిళ మృతి చెందిందనే విషయం తెలియదంటూ చెప్పారు. దీనిపై స్పష్టత ఇవ్వాలలి.. అని పోలీసులు అడిగినట్టు తెలిసింది.
‘మీకు, సినిమా థియేటర్ యజామాన్యాని కి కమ్యూనికేషన్ గ్యాప్ వల్లే ఇది జరగిందని మీరు భావిస్తున్నారా? ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు సినిమా చూడాలనే ఉద్దేశంతో అక్కడికి వచ్చారా? భారీ సంఖ్యలో సినీ అభిమానులు ఉన్న సమయంలో మీరు అక్కడకు వస్తే మరిం త రద్దీ పెరిగి తొక్కిసలాట జరిగే అవకాశాలు ఉంటాయనే ఆలోచన ఎందుకు చేయలేదు. మీరు మందీ మార్బలంతో ఆ సమయంలో అక్కడికి ఎలా వచ్చారు. సినిమా ప్రారంభమైన తర్వాత వస్తే నేరుగా థియేటర్ లోపలికి వెళ్లే అవకాశాలు ఉండేవి. ఎందుకు అలా చే యలేదు’ అని ప్రశ్నలు అడిగినట్టు తెలిసింది. 4 గంటలపాటు అర్జున్ను పోలీసులు విచారించారు. పోలీసులు తయారుచేసిన వీడియోతోపాటు ఇటీవల అర్జున్ ఏర్పాటుచేసిన ప్రెస్మీట్లో వెల్లడించిన అంశాలను పోలీసులు ఈ సందర్భంగా ప్రస్తావించినట్టు సమాచారం.
ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలీసులు అర్జున్ను విచారించారు. అనంతరం పోలీసు అధికారులెవ రూ కూడా మీడియాకు అందుబాటులోకి రాలేదు. సెంట్రల్ జోన్ డీసీపీ, చిక్కడపల్లి ఏసీపీ, ఇన్స్పెక్టర్లకు ఎన్నిసార్లు ఫోన్లు చేసినా లిప్ట్ చేయకపోవడం గమనార్హం. విచారణ కొ నసాగుతున్న సమయంలోనే సోషల్ మీడియా లో పుష్ప-2 సినిమాకు సంబంధించిన ‘దమ్ముంటే పట్టుకోర షెకావత్’ అనే పాటను టీ-సిరిస్ అధికారిక యూట్యూబ్ చానల్లో విడుదల చేసింది. ఈ పాట విడుదలైన ఏడు గంటల్లోనే ఐదున్నర లక్షల మంది వీక్షించారు. పాటను తొలగించాలంటూ కొందరు పోలీసు అధికారులు సినిమా యూనిట్‌పై ఒత్తిడి తెచ్చారనే ఆరోపణలు సైతం వచ్చాయి. సినిమాకు, పాటకు, విచారణకు సంబంధమే లేదంటూ అధికారులు ఈ ఆరోపణలను కొట్టిపారేశారు.
తొక్కిసలాట ఘటనకు కారకుడంటూ అల్లు అర్జున్ బౌన్సర్ అంథోని జాన్‌ను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేయగా అతనికి బెయిల్ మంజూరైంది. ఈ కేసులో 18 మందిని నిందితులుగా చేర్చారు. ఇందులో ఏ18 నిందితులుగా మైత్రీ మూవీస్ నిర్వాహకులను చేర్చారు.