హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో సీఎస్ఈ సీట్లకు పెంపునకు ఏఐసీటీఈ ఆమోదించడంతోపాటు జేఎన్టీయూ ఎన్వోసీ ఇచ్చిన తర్వాత కూడా రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ అనుమతి ఇవ్వకపోవడాన్ని హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. సీట్ల పెంపునకు అనుమతించాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఆ సీట్ల భర్తీకి మాస్ ఆప్ కౌన్సెలింగ్ నిర్వహించాలని, తద్వారా జరిగే అడ్మిషన్లు తమ తుది తీర్పునకు లోబడి ఉంటాయని పేర్కొంటూ సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
కొత్త కోర్సుల ప్రారంభం, సీట్ల పెంపు, కుదింపు, కోర్సుల విలీనం, రద్దుకు నిరాకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 24న ఇచ్చిన మెమోను, సాంకేతిక విద్యా చట్టంలోని 20వ సెక్షన్‌ను సవాల్ చేస్తూ పలు విద్యాసంస్థలు హైకోర్టులో 11 వ్యాజ్యాలను దాఖలు చేశాయి. ఈ కేసుల్లో మధ్యంతర ఉత్తర్వుల జారీకి గతంలో సింగిల్ జడ్జి నిరాకరించడంతో ఆ విద్యాసంస్థలు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించాయి. దీంతో సీట్ల పెంపునకు అనుమతించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన సీట్ల భర్తీకి మాప్ అప్కౌన్సెలింగ్ నిర్వహించాలని, ఈ వ్యవహారాన్ని సింగిల్ జడ్జి వద్దే తేల్చుకోవాలని చెప్పింది. రెండు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది.