హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో 49 ఎకరాల ‘పైగా’ భూములను కాజేసేందుకు ప్రయత్నించిన ఫలక్నుమా వాసి యాహిరా ఖురేషి, వట్టేపల్లికి చెందిన మహ్మద్ మొయినుద్దీన్పై క్రిమినల్ కేసుల నమోదుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును కోరింది. ఆ భూములను పైగా కుటుంబీకుల నుంచి తమ పూర్వీకులు కొనుగోలు చేశారంటూ తప్పుడు తీర్పులతో ఏకంగా కోర్టునే మోసగించేందుకు ప్రయత్నించిన ఆ ఇద్దరిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ శుక్రవారం హైకోర్టుకు తెలిపారు.