హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) మొదటి విడత సీట్లను గురువారం కేటాయిస్తారు. ఆప్షన్ల ఎంపికను బట్టి మెరిట్ ప్రకారం ప్రాధాన్యక్రమంలో విద్యార్థులకు సీట్లను కేటాయిస్తారు. దోస్త్ తొలివిడత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మే 6 నుంచి ప్రారంభమై, ఈ నెల 1వ తేదీతో ముగిసింది. వెబ్ఆప్షన్ల గడువు ఈ నెల 2వ తేదీతో ముగిసింది. మొదటి విడతలో వెబ్ ఆప్షన్లు ఎంచుకున్న వారికి గురువారం సీట్లను కేటాయిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 1,066 డిగ్రీ కాలేజీలుండగా, వీటిల్లో 4,49,449 సీట్లున్నాయి. వీటిలో 135 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలుండగా, 86 రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలున్నాయి. నిరుడు 3,89,049 సీట్లుంటే 2.05లక్షల సీట్లు నిండాయి. ఈ ఏడాది నాలుగు కొత్త కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చారు. గతంలో ప్రవేశపెట్టిన సెక్టార్ స్కిల్ కోర్సులను పలు కాలేజీల్లో విస్తరించారు. ఈ ఏడాది జూలై 8 నుంచి ఫస్టియర్ క్లాసులు ప్రారంభమవుతాయి.