హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 9 (నమస్తే తెలంగాణ): ప్రతిష్ఠాత్మకమైన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఔన్నత్యాన్ని ఉన్నతాధికారులు దిగజారుస్తున్నారు. విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసేందుకు కృషి చేయాల్సిన వీసీ, రిజిస్ట్రార్ వారి భవితవ్యాన్ని అంధకారంలోకి నెడుతున్నారు. విద్యార్థుల్లో నైపుణ్యతను, శాస్త్ర సాంకేతికతను పెంపొందించే కార్యక్రమాలకు కేంద్రం విడుదల చేస్తున్న కోట్ల రూపాయల నిధులను ఉన్నతాధికారులు ఇష్టానుసారం ఇతర పనులకు వినియోగిస్తున్నారు.
విద్యార్థులను తీర్చిదిద్దేందుకు వాడాల్సిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ నిధులను అడ్మినిస్ట్రేషన్ భవనాల నిర్మాణానికి ధారపోశారు. కేంద్ర ప్రభుత్వం గత ఏడేండ్లలో హెచ్సీయూకు రూ.1,000 కోట్లు కేటాయించి.. అందులో రూ.710 కోట్లను విడుదల చేసింది. ఇందులో కేవలం రూ.5.54 కోట్లను మాత్రమే విద్యార్థుల్లో శాస్త్రసాంకేతికత, నైపుణ్యాలను పెంపొందించేందుకు వినియోగించారు. మిగిలిన నిధులను భవనాలు నిర్మించేందుకు వెచ్చించారు. విద్యార్థులు ఆర్టీఐ యాక్టు ప్రకారం అడిగిన సమాచారంలో ఈ నిజాలు బయటపడ్డాయి.
కేంద్ర ప్రభుత్వం 2019-20 నుంచి 2025-26 విద్యాసంవత్సరం మధ్య ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్ కింద రూ.710 కోట్లు విడుదల చేసింది. ఇందులో కేవలం రూ.0.78 శాతం నిధులను మాత్రమే విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించేందుకు, పరిశోధనలకు, ప్రయాణ గ్రాంట్లకు ఖర్చు చేసినట్టు తెలుస్తున్నది. యూనివర్సిటీలో 65 శాతం మంది బీసీ విద్యార్థులు ఉన్నప్పటికీ వారికి స్కాలర్షిప్లు ఇచ్చేందుకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు.
దీంతో గత ఆరేండ్లలో హెచ్‌సీయూ ర్యాంకు పడిపోయింది. 2019లో యూనివర్సిటీ క్యాటగిరీకి సంబంధించి దేశంలోనే 4వ స్థానంలో ఉన్న హెచ్‌సీయూ 2025 నాటికి 18వ స్థానానికి పడిపోయింది. భవన నిర్మాణాలు, అడ్మినిస్ట్రేషన్ ఖర్చులకు కేంద్ర నిధులు వినియోగిస్తున్న వీసీ, రిజిస్ట్రార్లు.. ప్రొఫెసర్ల నియామకం, మౌలిక వసతుల కల్పనను పూర్తిగా గాలికొదిలేశారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. యూనివర్సిటీలో శాస్త్ర సాంకేతికతను మెరుగుపరచడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కేంద్ర నిధులను కమీషన్ల కోసమే భవన నిర్మాణాలకు ఉపయోగిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొద్ది నెలల కిందట రూ.55 కోట్లతో అడ్మినిస్ట్రేషన్ కాంప్లెక్స్‌ను నిర్మించేందుకు కేటాయించారు. కమీషన్లకు కక్కుర్తిపడటంతో ఆ భవనం నిర్మాణ దశలోనే కూలిపోయింది.
కేంద్రం నుంచి విడుదలైన రూ.710 కోట్ల ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ నిధుల వినియోగంపై శ్వేత పత్రం విడుదల చేయాలి. విద్యార్థుల పరిశోధనలు, నైపుణ్యాలు పెంపొందించేందుకు ఖర్చు చేయాల్సిన నిధులను భవనాల నిర్మాణానికి ఎలా వాడుతారు? యూనివర్సిటీలో ఎంతోమంది పేద, బలహీనవర్గాల విద్యార్థులు ఉన్నారు. వారికి కనీసం స్కాలర్షిప్లు ఇవ్వడంలేదు. హాస్టళ్లలో కనీస మౌలిక వసతులు కల్పించడం లేదు. ఉన్నతాధికారుల తీరుతో యూనివర్సిటీ ర్యాంకింగ్ ఘోరంగా పడిపోతున్నది. దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన యూనివర్సిటీ పేరు మసకబారుతున్నది.
-తుంగ రమేశ్, అధ్యక్షుడు, డీఎస్‌యూ
యూనివర్సిటీ విద్యార్థుల పరిశోధనలు, ప్రోత్సాహాలకు కేటాయించాల్సిన కోట్లాది రూపాయలను భవనాల నిర్మాణానికి కేటాయించడంతో 2019 నుంచి ర్యాంకు గణనీయంగా పడిపోతున్నది. ప్రతిష్ఠాత్మకమైన యూనివర్సిటీ రోజురోజుకు దిగజారిపోవటం ఆందోళన కలిగిస్తున్నది. దేశంలోనే అత్యున్నత యూనివర్సిటీల్లో ఒకటిగా పేరుగాంచి.. నేడు దిగువ స్థాయికి చేరడంలో ఉన్నతాధికారుల వైఫల్యమే ఉన్నది. ఇప్పటికైనా తీరు మార్చుకుని యూనివర్సిటీ పురోభివృద్ధికి పాటుపడాలి. లేకుంటే విద్యార్థులంతా ఏకమై ఆందోళనలు తీవ్రతరం చేస్తాం.
-అతీక్ అహ్మద్, సెక్రటరీ, ఎస్ఎఫ్ఐ