Alliance Air | శంషాబాద్ రూరల్, ఆగస్టు 3: తిరుమలలో వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన ఏడుగురు ఐర్లాండ్ ప్రయాణికులకు శనివారం శంషాబాద్ విమానాశ్రయంలో పట్టపగలే చుక్కలు కనిపించాయి. అలయన్స్ ఎయిర్‌లైన్ సంస్థ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఆ ఏడుగురు 10 గంటలపాటు ఎయిర్‌పోర్టులోనే పడిగాపులు కాయాల్సి వచ్చింది.
శనివారం ఉదయం 5.30 గంటలకు అలయన్స్ ఎయిర్‌లైన్స్‌లో తిరుపతికి బయల్దేరేందుకు వచ్చిన ఆ ఏడుగురి వద్ద 100 కిలోల కంటే ఎక్కు వ లగేజీ ఉన్నది. బోర్డింగ్ పాస్‌లు ఇచ్చాక ఆ లగేజీని వారే గేటు వద్దకు తీసుకెళ్లాలని ఆ విమానయాన సంస్థ సిబ్బంది సూచించారు.
తీరా ఆ లగేజీతో వారు 2 నిమిషాలు ఆలస్యంగా గేటు వద్దకు చేరుకోవడంతో వారిని అక్కడే వదిలేసి విమానం వెళ్లిపోయింది. దీనిపై శంషాబాద్ ఎయిర్‌పోర్టు సిబ్బందిని సంప్రదించినా పట్టించుకోలేదని బాధితులు తెలిపారు. చివరకు వారు మరోసారి టికెట్లు తీసుకుని సాయంత్రం 6 గంటలకు ఇండిగో విమానంలో తిరుపతికి బయల్దేరారు.