చెరో విల్లా.. చెరువు గుల్ల!
చెరువును మింగి వెంచర్ వెలిసింది. బఫర్‌జోన్‌ను చదును చేసి ప్రాజెక్టు లేచింది. నాలాను పూడ్చి విల్లాలు మొలిచాయి. ఫీడర్ చానళ్లను చదును చేసి, నిర్మాణాలు చేపట్టారు. నిబంధనలకు నీళ్లొదిలారు. నీళ్లున్న ‘చిన్నచెరువు’ గొంతునులిమి అక్రమాలకు తెరలేపారు.
- కోహెడలో ‘అంబుజా సంఘీ సామ్రాట్ సిటీ’ పేరిట అరాచకం
- చిన్న చెరువు, ఫీడర్ చానళ్ల గొంతు నులిమి విల్లాల నిర్మాణం
- నీటి వనరులో 7 విల్లాలు, ఆఫీసు భవనం, 11 పిల్లర్ల గుర్తింపు
- మైనింగ్ చార్జీల పేర రూ.100 కోట్లకు పైగా సర్కార్‌కు నష్టంఎ
- ఎంపీకొకటి! ఎమ్మెల్యేకు మరొకటి!!
- అక్రమాల ‘ఛాయల’లో అధికార దాసోహం
- నీటిపారుదల శాఖ ఇంజినీర్ల సర్వేలో బయటపడిన నిజాలు
- అక్రమాలపై నీటిపారుదల, మైనింగ్ శాఖ అధికారుల లేఖలు
- అనుమతుల రద్దుకు హెచ్ఎండీఏ కమిషనర్‌కూ సిఫార్సులు
- కన్నెత్తి చూసేందుకు మున్సిపల్, రెవెన్యూ అధికారుల జంకు
- అటు వెళ్లకూడదంటూ ధమ్కీ ఇస్తున్న ఎంపీ, ఎమ్మెల్యే
- విల్లాలు సహా భారీగా డబ్బు చేతులు మారినట్టు ఆరోపణలు
- ఓఆర్ఆర్ లోపల చెరువు మాయమైనా పట్టించుకోని హైడ్రా
- భూములు నిషేధిత జాబితాలో ఉన్నా యథేచ్ఛగా నిర్మాణాలు
- మైనింగ్ అనుమతులు లేకుండానే యథేచ్ఛగా గుట్టల తవ్వకం
చెరువును మింగి వెంచర్ వెలిసింది. బఫర్‌జోన్‌ను చదును చేసి ప్రాజెక్టు లేచింది. నాలాను పూడ్చి విల్లాలు మొలిచాయి. ఫీడర్ చానళ్లను చదును చేసి, నిర్మాణాలు చేపట్టారు. నిబంధనలకు నీళ్లొదిలారు. నీళ్లున్న ‘చిన్నచెరువు’ గొంతునులిమి అక్రమాలకు తెరలేపారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కోహెడలో చేపట్టిన ‘అంబుజా సంఘీ సామ్రాట్ సిటీ’ ప్రాజెక్టు అక్రమాల పునాదులపై నిర్మితమవుతున్నది. అందుకోసం నీటివనరులనే కాదు, పక్కనున్న గుట్టలనూ కొల్లగొడుతున్నారు. ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి పర్మిషన్ లేదు. సంబంధిత విభాగాల నుంచి అనుమతుల్లేవు. అక్రమాల్లో పొత్తుగూడిన ఓ కాంగ్రెస్ ఎంపీ, మరో అధికార పార్టీ ఎమ్మెల్యే మద్దతుతో విల్లా వెంచర్ శరవేగంగా నిర్మాణమవుతున్నది.
కోహెడలోని సర్వేనంబర్ 167లో ఉన్న 530.25 ఎకరాలు 60 ఏండ్ల క్రితం వరకు ప్రభుత్వ భూమే. రికార్డులూ అదే స్పష్టంచేస్తున్నాయి. క్రమక్రమంగా అది తగ్గుతూ వచ్చింది. ప్రైవేట్ వ్యక్తుల పేరిట పట్టాలుగా మారుతూ వచ్చింది. అందులో నుంచి 54 ఎకరాల్లో అంబుజా సంఘీ సామ్రాట్ సిటీ పేరిట ఓ ప్రాజెక్టు ప్రారంభమైంది. అక్కడే అసలు కథ మొదలైంది. వెంచర్ కోసం చిన్నచెరువును ధ్వంసం చేశారు. ఫీడర్ చానళ్లను పూడ్చారు. గరిష్ఠ నీటినిల్వ సామర్థ్యం ఉన్న జోన్‌ను చదును చేశారు. చెరువును కొల్లగొట్టారని ఇరిగేషన్ శాఖ సైతం తేల్చింది. దర్యాప్తు జరిపి, ప్రభుత్వానికి నివేదించింది. అయినా ఆ ప్రాజెక్టు ఆగలేదు. అధికారులు అడ్డుపడినా పనులు నిలిచిపోలేదు.
చెరో విల్లా తీసుకున్న అధికార పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే.. అక్రమాలకు అండగా నిలిచారు. అధికారులు అటువైపు చూడకుండా అడ్డుపడ్డారు. మున్సిపల్, రెవెన్యూ శాఖలకు ధమ్కీ ఇచ్చారు. కేవలం విల్లాలతో సరిపెట్టకుండా వారిద్దరూ పెద్దఎత్తున డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. రియల్ఎస్టేట్ సంస్థ సహజ వనరులను కొల్లగొడుతున్నా.. ప్రభుత్వ విభాగాలు చేష్టలుడిగి చూస్తున్నాయి. కాంగ్రెస్ నేతల భయానికి అధికారులు కండ్లు మూసుకున్నారు. ఇక పొద్దున లేచిన దగ్గరినుంచీ నీటివనరుల పరిరక్షణపై ప్రవచనాలు బోధించే హైడ్రా ఇంకా నిద్ర లేవలేదు. ఔటర్ రింగ్‌రోడ్డు లోపల ఓ చెరువు మాయమైనా స్పందించలేదు.
యనో అధికార పార్టీ ఎంపీ. ముఖ్యనేతకు సన్నిహితుడు. మీడియా సమావేశాల్లో అందరిపైనా నోరేసుకుని పడిపోయే రకం. అవగాహనలేని అంశాలపై ఆయనగారి అజ్ఞాన ప్రదర్శన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంటాయి. కోహెడ అక్రమాల వెంచర్ ‘ఛాయల’కు అధికారులెవరూ రాకుండా ఆయన అడ్డుగోడగా నిలిచారు. ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యేనూ ఆ దందాలోకి దించారు. కొసమెరుపు ఏమిటంటే, సియోల్‌కు వెళ్లి మరీ నదుల ప్రక్షాళనను పరిశీలించి వచ్చిన బృందంలో ఉన్న వారిద్దరూ.. ఇప్పుడు చెరువును మింగిన ప్రాజెక్టుకు చెరోవైపు అండగా నిలుస్తున్నారు.
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ)/రంగారెడ్డి : ఆయన ఓ ఎంపీ.. ‘ముఖ్య’నేతకు ప్రధాన అనుచరుడు కూడా. ఆ ఎంపీకి తోడుగా మరో ఎమ్మెల్యే.. అవినీతి అంటే ఏమిటో తమకు తెలియదని మైకు కనిపిస్తే చాలు ఈ ఇద్దరూ గొప్పగా చెప్పుకొంటారు. వీళ్లిద్దరికీ చెరువులు, నదులు అంటే ఎంతో ప్రేమ. మూసీలాంటి జీవనదిని సియోల్‌లోని నదీ పరీవాహకంగా మార్చాలనే యజ్ఞంలో వీరు కూడా భాగస్వాములే. అందుకే సియోల్‌కు వెళ్లిన బృందంలో వీళ్లిద్దరూ ఉన్నారు.
నీటి వనరులను కాపాడుకోవాలంటూ అనేక నీతులు కూడా చెప్పారు. సీన్ కట్ చేస్తే.. ఆ ఇద్దరు ప్రజాప్రతినిధులు ప్రాతినిధ్యం వహిస్తున్న పరిధిలో ఓ చారిత్రక చెరువు ఉన్నట్టుండి కనుమరుగైంది. ఆ చెరువు గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్య ప్రాంతంలో (ఎంఎఫ్ఎల్) వరదను మోసుకొచ్చే ఫీడర్ చానళ్లను పూర్తిగా మట్టితో కప్పేశారు. విల్లా ప్రాజెక్టు మాటున ఆ నీటి వనరు గొంతు నులిమారు. సాక్షాత్తు నీటిపారుదల శాఖ ఇంజినీర్లు అక్కడికి పోయి సర్వే చేశారు. చెరువు ఎంఎఫ్ఎల్, బఫర్‌తో పాటు కాలువలను మూసివేసి చదును చేసిన ఎకరన్నరకు పైగా విస్తీర్ణంలో ఏడు విల్లాలు, ఒక కార్యాలయ భవనంతో పాటు ఇతర విల్లాలకు చెందిన 11 పిల్లర్లను అందులో నిర్మించారని తేల్చారు. అంతేకాదు.. ఎలాంటి మైనింగ్ అనుమతులు లేకుండా అక్కడ సహజసిద్ధమైన గుట్టలన్నింటినీ భారీ యంత్రాలతో పిండి చేసి సొమ్ము చేసుకుంటున్నారు.
మరి.. సియోల్ వెళ్లి జల వనరులపై ప్రేమ ఒలకబోసిన ఇద్దరు ప్రజాప్రతినిధులు ఈ అరాచకాన్ని అడ్డుకోలేదు. ఇదేకాదు, ‘హైదరాబాద్ మహానగరంలో చెరువు జోలికొస్తే తాటతీస్తాం!’ అంటున్న హైడ్రా సైతం ఈ నీటి వనరును పట్టించుకోవడం లేదు. తెరవెనుక కారణం పెరుమాళ్లకెరుక! కానీ.. సదరు రియల్టర్‌తో కుమ్మక్కై చెరో విల్లాతో పాటు తెరవెనుక భారీ ఎత్తున ‘సంతృప్తి’కరమైన ప్యాకేజీలు తీసుకున్నారనే ఆరోపణలు మాత్రం గుప్పుమంటున్నాయి. ఎందుకంటే.. ఏడాదిన్నరగా నీటిపారుదల, మైనింగ్ శాఖ అధికారులు ఆ ప్రాజెక్టు అనుమతులు రద్దు చేసి, తగిన చర్యలు తీసుకోవాలంటూ మున్సిపల్, రెవెన్యూ శాఖలకు లేఖలు రాస్తున్నా కించిత్తు చర్యలు కనిపించడం లేదు. కారణం.. తెరవెనుక ఆ ఇద్దరు ప్రజాప్రతినిధుల అల్టిమేటంతో అధికారులు అటువైపు కన్నెత్తి చూసేందుకే జంకుతున్నారు. మరి.. ఇదే ఓ సామాన్యుడు చిన్న నాలా మీద ఇల్లు కట్టుకుంటే బుల్డోజర్లతో విరుచుకుపడి ఇల్లు పీకి పందిరేసే హైడ్రా అధికారులూ ఇప్పుడు పత్తా లేరంటే అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ప్రమేయానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి?
ఆవిరైన నీటి వనరు.. పిండైన గుట్టలు
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కోహెడ గ్రామ పరిధిలోని సర్వేనంబర్ 167లో 530.25 ఎకరాల భూమి ఉన్నది. 1955-56 రికార్డుల్లో ఈ భూమి గైరాన్ (ప్రభుత్వ భూమి)గా నమోదై ఉన్నది. 1964-65 వరకు రికార్డుల్లో ఇదేరీతిన నమోదై వస్తూ ఉంది. కానీ 1965-66 నుంచి మాత్రం రికార్డుల్లో 266.09 ఎకరాలు సర్కారీగా వస్తుండగా… మిగిలిన భూమి 167/2 పేరుతో ప్రైవేట్ వ్యక్తుల పేరిట వస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఓ పారిశ్రామికవేత్త పేరిట ఇందులోని కొంత భూమి రికార్డుల్లోకి మారింది.
అందులో సుమారు 54 ఎకరాల భూమిని ప్రవీణ్‌రెడ్డి అనే వ్యక్తికి డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఇవ్వగా… అందులో అంబుజా సంఘీ సామ్రాట్ పేరిట విల్లాల నిర్మాణం చేపట్టారు. ఈ మేరకు హెచ్ఎండీఏ నుంచి అనుమతులు తీసుకున్నారే తప్ప మిగిలిన అంశాల్లో మాత్రం నిబంధనలను పూర్తిస్థాయిలో ఉల్లంఘిస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఓ నీటి వనరును పూర్తిగా కాలగర్భంలో కలపడంతో పాటు ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా సహజసిద్ధంగా ఏర్పడిన గుట్టలను పిండి చేసి కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు. ప్రభుత్వ ఖజానాకు వందల కోట్లు గండి కొడుతున్నారు.
చిన్న చెరువును సమాధి చేసి విల్లాలు
ఆక్సిజన్ శరీరంలోకి వెళ్తే మనిషి జీవిస్తాడు. అదేరీతిన ఎగువ నుంచి వరద వస్తేనే చెరువుకు మనుగడ. అలాంటిది ఓ నీటి వనరుకు ఆక్సిజన్‌లాంటి వరద ప్రవాహాన్ని పూర్తిగా నిలిపివేస్తే ఆ చెరువు కాలగర్భంలో కలిసిపోవడం తప్ప బతికి బట్టకట్టదు. అంబుజా సంఘీ సామ్రాట్ పేరిట చేపట్టిన విల్లాల ప్రాజెక్టు హెచ్ఎండీఏ నోటిఫై చేసిన చిన్న చెరువు (ఐడీ నంబర్ 1962)కు సమాధి కట్టింది. ఎగువన గుట్టలపై నుంచి పుష్కలంగా వచ్చే వర్షపు నీరు ఫీడర్ చానల్ ద్వారా ఈ చెరువులోకి చేరుతుంది. ఆ ఫీడర్ చానల్‌తో పాటు చిన్న చెరువు ఎంఎఫ్ఎల్ (గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం), బఫర్‌జోన్‌లోని భూమిని పూర్తిగా మట్టితో నింపేసి దానిపై విల్లాల నిర్మాణం చేపట్టారు. దీంతో చిన్న చెరువుకు వరద నీరు మోసుకొచ్చే ఫీడర్ చానల్, ఎంఎఫ్ఎల్, బఫర్జోన్లు పూర్తిగా మూసుకుపోయాయి. ఈ మేరకు సర్వేనంబర్లు 155. 156, 159, 160-164, 167లకు కూడా ఈ విల్లా ప్రాజెక్టును విస్తరించారు.
సర్వేతో అక్రమాలు బయటకు..
అంబుజా సంఘీ సామ్రాట్ విల్లా ప్రాజెక్టు పేరిట నీటి వనరును పూర్తిగా కాలగర్భంలో కలుపుతున్నారంటూ ఫిర్యాదులు వెల్లువెత్తడంతో రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించారు. 25.09.2025న మధ్యాహ్నం 3.30 గంటలకు సంబంధిత డిప్యూటీ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, మండల సర్వేయర్‌తో కలిసి సంయుక్తంగా సర్వే నిర్వహించి, నివేదిక రూపొందించారు.
అధికారుల చేతులు కట్టేసిన ప్రజాప్రతినిధులు
రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన సర్వే ప్రకారం చిన్న చెరువు కాలగర్భంలో కలిసిపోతున్నందున సంబంధిత డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రెవెన్యూ, మున్సిపల్ శాఖలను అప్రమత్తం చేశారు. ఈ మేరకు నిరుడు సెప్టెంబరులోనే అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్, తుర్కయాంజాల్ మున్సిపల్ కమిషనర్‌కు సర్వే నివేదికతో లేఖ రాశారు. అంబుజా సంఘీ సామ్రాట్ విల్లా ప్రాజెక్టు ద్వారా చిన్న చెరువు అనే నీటి వనరు పూర్తిగా ధ్వంసమైందని, వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకోవాలని అందులో కోరారు.
నీటి వనరులోని ఆక్రమణల తొలగింపునకు చర్యలు చేపట్టాలన్నారు. వెంటనే ఆ ప్రాజెక్టు అనుమతులను రద్దు చేసి నీటి వనరును కాపాడాల్సిందిగా మున్సిపల్ కమిషనర్‌కు సూచించారు. అయినా రెండు శాఖల అధికారులు ఇప్పటిదాకా అటువైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. అక్టోబర్ 6న కూడా మరో లేఖ రాసి వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. కానీ అధికారుల్లో చలనం లేదంటే తెర వెనుక సదరు ఎంపీ, ఎమ్మెల్యేల ఒత్తిడితోనే అధికారుల కాళ్లు ముందుకు కదలడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.
వందల కోట్ల సంపదను కొల్లగొడ్తూ..
సహజ సిద్ధంగా ఏర్పడిన గుట్టలను పిండి చేస్తూ వందల కోట్ల సహజ సంపదను కొల్లగొడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. విల్లాల నిర్మాణానికి అనుమతులు ఉన్నా, ఆ భూముల్లో గుట్టలు ఉంటే గనుల శాఖ నుంచి అనుమతులు తీసుకొని, ప్రభుత్వానికి చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. సర్వేనంబర్లు 155, 156, 159, 160-164, 167ల్లో అనుమతులు లేకుండా అక్రమంగా భారీ ఎత్తున తవ్వకాలు జరుపుతున్నారు. వివిధ కంపెనీల పేరిట భారీ యంత్రాలను వినియోగిస్తూ రాయి, కంకర తవ్వకాలు జరుపుతున్నారు. ఫిర్యాదుల మేరకు మైనింగ్ శాఖ ఏడీ రామచంద్రయ్య, ఆర్ఐ వెంకటేశ్వర్లు, తహసీల్దార్, విజిలెన్స్ విభాగం వాళ్లు మైనింగ్ దగ్గర తనిఖీలు చేసి రూ.9.80 కోట్ల జరిమానా విధించారు.
ఆ వాహనాలపై రూ.25 వేల చొప్పున తహసీల్దార్ జరిమానాలు విధించారు. ఇప్పటివరకు జరిమానా వసూలు చేయలేదు. ఆ తర్వాత కూడా 24 గంటల పాటు భారీ యంత్రాలతో అక్రమ తవ్వకాలు జరుపుతూనే ఉన్నారు. మూడు ఏజెన్సీల పేరుతో జరుపుతున్న ఈ అక్రమ తవ్వకాలతో వందల కోట్ల సహజ సంపద కొల్లగొడుతున్నారు. సర్కార్ ఖజానాకు భారీ నష్టం కలిగిస్తున్నారు. అయినా ఆ ఇద్దరు ప్రజాప్రతినిధుల ‘హస్తం’ ఉండటంతో ఏఒక్కరూ చర్యలు తీసుకోవడం లేదు. పలుమార్లు మైనింగ్ శాఖ.. స్థానిక పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా పోలీసులు కూడా అటువైపు వెళ్లడం లేదు. అక్రమ తవ్వకాలను నిలువరించడం లేదు.
నివేదికలోని కీలక అంశాలు..
- ప్రవీణ్‌రెడ్డి అనే బిల్డర్ అంబుజా సంఘీ సామ్రాట్ విల్లా ప్రాజెక్టు పేరిట చేపట్టిన నిర్మాణాల కారణంగా చిన్న చెరువు (హెచ్ఎండీఏ ఐడీ నెంబరు 1962) ఫీడర్ చానల్, ఎంఎఫ్ఎల్, బఫర్‌జోన్‌కు తీవ్ర నష్టం వాటిల్లింది.
- ఫీడర్ చానల్, ఎంఎఫ్ఎల్, బఫర్‌జోన్‌లోనే విల్లాలు నిర్మించడం వల్ల చిన్న చెరువుకు వచ్చే వరద ప్రవాహానికి అడ్డంకి ఏర్పడింది. తద్వారా ఎగువ ప్రాంతంలో ముంపు సమస్య ఏర్పడే ప్రమాదమున్నది.
- సర్వేలో భాగంగా అన్ని సర్వే నంబర్లకు హద్దులు నిర్ధారించాం. తద్వారా విల్లా ప్రాజెక్టు అనేది సర్వేనంబర్ 155, 156, 159, 160-164, 167ల్లో విస్తరించినట్టుగా గుర్తించాం.
- గ్రామ నక్షను పరిశీలించగా… సర్వేనంబర్ 156లో దక్షిణం నుంచి ఉత్తర దిశగా కాలువ పోతున్నట్టు ఉన్నది. టోపోషీట్ ఈ44ఎం11ను పరిశీలించగా దక్షిణం నుంచి ఉత్తరం దిశగా మూడు వాగులు పోతున్నాయి. ఇవి పెద్ద అంబర్‌పేటలోని చిన్న చెరువుకు ఫీడర్ చానళ్లుగా పని చేస్తున్నాయి.
- ప్రత్యక్షంగా స్థలాన్ని పరిశీలించగా సంఘీ సిటీ డెవలపర్లు మూడు వాగులను పూర్తిగా మట్టితో కప్పి నిర్మాణాలు చేపట్టినట్టు తేలింది. వాగు-1లో 00-07.1 గుంటలు, వాగు-2లో 00-10.7 గుంటలు, వాగు-3లో 00-10.5 గుంటలు ఇలా చిన్న వాగుకు వరద వచ్చే మొత్తం మార్గాలను మూసివేసినట్టుగా తేలింది.
- దీంతో పాటు ఎంఎఫ్ఎల్, బఫర్జోన్లను కూడా ఆక్రమించి, నిర్మాణాలు చేపట్టారు. ఇలా వాగులు, ఎంఎఫ్ఎల్, బఫర్ల్లో చేపట్టిన నిర్మాణాలను పరిశీలిస్తే.. అందులో ఏడు విల్లాలు, పదకొండు పిల్లర్లు, ఒక ప్రహరీ, ఒక కార్యాలయ భవనం ఉన్నట్టుగా సర్వేలో తేలింది. దీని ద్వారా చిన్న చెరువు అనేది ఇక బతికి బట్టకట్టే పరిస్థితులు లేకుండా పోయాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

