మహబూబ్‌నగర్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ) : ఆదివాసీల హక్కుల కోసం పోరాడుతున్న ఆదివాసీ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు, చెంచు నేత, మాజీ సర్పంచ్ చిగుర్ల మల్లికార్జున్‌ను పోలీసులు నిర్బంధించి, తీవ్రంగా కొట్టినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 24 గంటలుగా అతని ఆచూకీ లేకపోవడంతో కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మల్లికార్జున్ కుటుంబసభ్యులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం సార్లపల్లికి చెందిన మల్లికార్జున్ శనివారం సాయంత్రం మన్ననూర్‌కు వెళ్లారు. అక్కడ మన్ననూర్‌కు చెందిన ఆదివాసీ నాయకులకు, మల్లికార్జున్‌కు మధ్య ఘర్షణ జరిగింది. మన్ననూర్‌కు చెందిన ఐదుగురు మల్లికార్జున్‌ను కొట్టి గాయపరిచారు. మల్లికార్జున్ బంధువులు, కుటుంబసభ్యులు కూడా మల్లికార్జున్‌పై దాడికి పాల్పడ్డ వారిపై తిరిగి దాడి చేసినట్టు తెలిసింది. మరోవైపు, తనపై దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మల్లికార్జున్ అమ్రాబాద్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. మల్లికార్జున్ అమ్రాబాద్ పోలీసుస్టేషన్లో ఉండటంతో ఆయన బంధువులు అక్కడకు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ పోలీసులు, ఆదివాసీల మధ్య వాగ్వాదం జరిగినట్టు తెలిసింది.
పోలీసులు ఆదివాసీ యువకుడిని కొట్టడంతో చనిపోతానంటూ అతను పోలీస్‌స్టేషన్ ప్రాంగణంలో ఉన్న చెట్టుపైకి ఎక్కాడు. ఈ ఘటనలో పోలీసులకు, ఆదివాసీలకు మధ్య తోపులాట జరిగినట్టు సమాచారం. అయితే ఆదివాసీలు అమ్రాబాద్ సీఐపైనా, పోలీసుస్టేషన్పైనా దాడిచేసినట్టు పోలీసులు చెప్తున్నారు. మల్లికార్జున్‌పై దాడికి పాల్పడ్డవారిని వదిలిపెట్టి, ఫిర్యాదు చేయడానికి వచ్చిన మల్లికార్జున్‌ను పోలీసుస్టేషన్లో ఉంచుకొని కుటంబసభ్యులకు చూపించకపోవడంతో వారు కోపోద్రిక్తులైనట్టు తెలిసింది. పోలీసులు పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ఆదివాసీలందరినీ ఇంటికి పంపించి మల్లికార్జున్‌ను మాత్రం తర్వాత పంపిస్తామని చెప్పారు. అయితే, ఆదివాసీలు ఇంటికి వెళ్లగా, మల్లికార్జున్ మాత్రం ఇంటికి చేరుకోలేదు. పోలీసులను అడిగితే అప్పుడే పంపించామని, తమ వద్ద లేడని చెప్పడంతో కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళనకు గురయ్యారు. మల్లికార్జున్‌ను పోలీసులు అమ్రాబాద్ స్టేషన్లోనే నిర్బంధించి, రాత్రి మొత్తం గొడ్డును బాదినట్టు తీవ్రంగా హింసించారని బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసుల దెబ్బలకు తట్టుకోలేక మల్లికార్జున్ అరుపులు, కేకలు వేస్తుంటే.. అది విని అక్కడే ఉన్న ఆదివాసీ యువకులు దగ్గరికి వెళ్లి చూడగా మల్లికార్జున్‌ను పడుకోబెట్టి తీవ్రంగా కొడుతున్నట్టు గమనించారని తెలిపారు. మల్లికార్జున్‌ను కొట్టిన విషయం ఎవరికైనా చెబితే మల్లికార్జున్‌ను మళ్లీ బయటికి రాకుండా, ఎక్కడ కనిపించకుండా చేస్తామని పోలీసులు హెచ్చరించి పంపించినట్టు ఆదివాసీలు ఆరోపించారు.
మల్లికార్జున్ ఆచూకీపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పందించారు. అచ్చంపేట డీఎస్పీతో ఫోన్లో మాట్లాడి ఆదివాసీ నాయకుడు మల్లికార్జున్‌ను నిర్భందించడం, కొట్టడం, ఆదివాసీలను పోలీసుస్టేషన్లో ఉంచడాన్ని తప్పు బట్టి వారిని వెంటనే ఇంటికి పంపించాలని కోరినట్టు తెలిసింది. ఆదివారం అచ్చంపేటకు వచ్చిన మంత్రి సీతక్క కూడా ఈ విషయంపై ఆరా తీసినట్టు తెలిసింది. మంత్రి సీతక్క పర్యటన రోజే ఆదివాసీ నాయకుడిని పోలీసుస్టేషన్లో నిర్భందించి చిత్రహింసలు పెట్టడం పట్ల అందరూ ఖండించారు. ఎంపీ మల్లు రవి కూడా ఈ విషయంపై మాట్లాడినట్టు సమాచారం.
ఇదిలాఉండగా, ఆదివారం పోలీసులు తమ వాహనాలతో సార్లపల్లి గ్రామానికి వెళ్లి ఆదివాసీ యువకులు, కుటుంబసభ్యులను జీపులో ఎక్కించుకొని అచ్చంపేట పోలీస్‌స్టేషన్‌కి తీసుకువచ్చారు. అప్పటికీ మల్లికార్జున్ ఎక్కడ ఉన్నాడో చెప్పలేదు. విషయం బయటకు తెలియడంతో మీడియా, ప్రజాసంఘాలు, ఇతర పార్టీల వారు ఒక్కొక్కరుగా పోలీస్‌స్టేషన్‌కి రావడంతో ఆదివాసీ నాయకుడిని నిర్బంధించారనే సమాచారం విస్తృతం అయింది. ఈ నేపథ్యంలో పోలీసులపై, స్టేషన్‌పై ఆదివాసీలు దాడి చేశారని, వారందరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తామంటూ మీడియాకు పోలీసులు లీకులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో తమ నాయకుడు ఎక్కడ ఉన్నాడో చూపించాలని పోలీసులను ఆదివాసీలు డిమాండ్ చేశారు. అసలు ఉన్నాడా, లేడా, ఎందుకు చూపించడం లేదని ప్రశ్నించారు. కుటుంబసభ్యులు, బంధువుల ద్వారా వివరాలు సేకరించేందుకు వెళ్లిన మీడియాను పోలీసులు కలువనీయలేదు. ఒకవేళ మీడియాకు చెబితే కేసులు బలంగా పెట్టి మల్లికార్జున్ బయటకు రాకుండా చూస్తామని, ఎవరైనా పోలీసులను కాదని మీడియాకు చెబితే వారిని వదిలి పెట్టబోమని హెచ్చరించడంతో ఆదివాసీలు మీడియా వారితో మాట్లాడేందుకు భయపడ్డారు.