హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ప్రజాస్వామ్యం చావుదెబ్బతిన్నదా? విచ్చలవిడి కరెన్సీ నోట్లు, దొంగ ఓటర్లు కలిసి ప్రజా ఓట్లను ఓడించాయా? కాంగ్రెస్, ఎన్డీఏ, ఎంఐఎం, కమ్యునిస్టు పార్టీల అక్రమ బంధం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందా? రౌడీదర్బార్ గుప్పిట్లో జూబ్లీహిల్స్ బందీ అయ్యిందా? అధికారమదం, ధనబలం, గుండాగిరి, ఓట్‌చోరీతోనే కాంగ్రెస్ గెలిచిందా? అధికార పార్టీతో అంటకాగిన రౌడీషీటర్లు, పోలీసులు, ఎన్నికల కమిషన్ కలిసికట్టుగా ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేశారా? ఓట్ల పోలరైజేషన్, ఓట్ల డివిజన్ కోసం ఎన్డీఏ, కాంగ్రెస్ మధ్య క్విడ్‌ప్రోకో జరిగిందా? రెఫరెండమంటే పారిపోయినవాళ్లకు ఇన్ని ఓట్లు రావడానికి కారణం ఇదేనా? అంటే.. జూబ్లీహిల్స్‌లో జరిగిన పోలింగ్ సరళి చూసిన ప్రతి ఒక్కరూ ‘అవును’ అనే అంటున్నారు. ఒక్క బీఆర్ఎస్ పార్టీని ఓడించడానికి రాష్ట్రంలో ఉన్న రాజకీయ శక్తులన్నీ అక్రమ పొత్తులు పెట్టుకున్నా ధైర్యం చాలక, 20 వేల దొంగ ఓట్లతో ప్రజాస్వామ్యంపై దండయాత్ర చేశారని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. గెలుపు కోసం, మెజారిటీ కోసం అధికార పార్టీ కనీవినీ ఎరుగని అరాచకానికి పాల్పడిందని విమర్శిస్తున్నారు. ఫలితంగా కాంగ్రెస్ 24,729 ఓట్ల మెజార్టీతో గెలిచిందని విశ్లేషిస్తున్నారు.
విచ్చలవిడిగా దొంగఓట్లు
‘అర్థబలం, అంగబలం అంతా ఉపయోగించైనా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలవాలి. తెర వెనుక కాళ్లు పట్టుకొనైనా సరే తెర మీద మన విజయం కనపడాలి’ ఇదీ ముఖ్యనేత.. నంబర్-2 నేతకు నిర్దేశించిన లక్ష్యం. జూబ్లీహిల్స్‌లో గెలిచామని అనిపించుకోవడానికి తెగబడని అరాచకం లేదు. 20 వేలకుపైగా దొంగ ఓటర్లను ‘దిగుమతి’ చేసుకున్నారు. సొంత పేరు చెప్పలేని ఓటరు ఒకరు, తండ్రి పేరు అడిగితే నీళ్లు నమిలిన ఓటరు మరొకరు. అడ్రస్ ఏమిటో తెలియక వెర్రిచూపులు చూసిన ఓటరు ఇంకొకరు. ఇలా.. వందలు, వేల మంది. అందరూ నిర్భీతిగా బూత్‌ల ముందు బారులుతీరి ఓటేశారు. వారి చేతిలో ఉన్న ఓటర్ స్లిప్పులు మాత్రమే ఒరిజినల్.
ఐడీకార్డు, ఓటరు కార్డువంటివన్నీ నకిలీవే. కార్వాన్, రాజేంద్రనగర్, ఖైరతాబాద్, బీదర్, గుల్బర్గా ప్రాంతాల నుంచి వచ్చిన దొంగ ఓటర్లు నిర్భీతిగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి వెళ్లిపోయారు. వీరికోసం చెక్‌పోస్టుల వద్ద గేట్లు తెరుచుకున్నాయి. పోలింగ్ కేంద్రాల ఎదుటే బహిరంగంగా ఓటు వేయ వచ్చిన వారికి టేబుల్ మీద నుంచి ఓటర్ స్లిప్పులు, టేబుల్ కింద నుంచి చీరలు పంపిణీ చేశారు. ఫోన్ నంబర్ అడిగి అక్కడికక్కడే ప్రతి దొంగ ఓటరుకు రూ.5 వేల చొప్పున ఫోన్‌పే చేశారు. క్యూలైన్లలో నిలిపి ఓట్లు వేయించారు. వీరిని పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులుగానీ, ఇతర అధికారులు గానీ ప్రశ్నించలేదు. డ్రోన్ కెమెరాలతో అంతా చూస్తున్నామని ఢాంబికాలు పలికిన ఎన్నికల కమిషన్ కండ్లు మూసుకొని కాంగ్రెస్ సేవలో తరించింది. బీజేపీ డైరెక్షన్లో కాంగ్రెస్ నేతల ఆగడాలను అధికారికంగా అనుమతించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది.
దొంగ ఓటర్లను తరలించిన ఎంఐఎం
హోరాహోరి ప్రచారంతో బీఆర్ఎస్ పార్టీ గెలుపు దిశగా పయనిస్తున్నదని ఇంటెలిజెన్స్ నివేదికలు అందటంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన అమ్ముల పొదిలో అస్త్రంగా ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్‌ని చివరిరోజు ప్రయోగించారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఆయన విద్వేషాలను రెచ్చగొట్టేలా మాట్లాడి వెళ్లిపోవడం, మరుసటి రోజే ఢిల్లీలో బాంబు పేలుళ్లు జరగడంతో బీఆర్ఎస్ ఓటు బ్యాంకు చెదిరిపోయిందని అంటున్నారు. అప్పటి దాకా కారు గుర్తుకు ఓటేయాలని భావించిన తటస్థ ముస్లిం ఓటర్లు మనుసు మార్చుకొని కాంగ్రెస్ వైపు మళ్లినట్టు విశ్లేషిస్తున్నారు. మరోవైపు, ఎంఐఎం అధినేతలు అసదుద్దీన్ ఒవైసీ, అక్బరుద్దీన్ ఒవైసీ నేరుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదుగానీ వెనుక ఉండి కాంగ్రెస్‌ను గెలిపించడానికి తీవ్రంగా ప్రయత్నించినట్టు చెప్తున్నారు.
స్థానిక ముస్లింల ఓటింగ్‌ను కాంగ్రెస్ వైపు పోలరైజ్ చేయడం ఒక ఎత్తయితే, నకిలీ ఓటర్లను తరలించి ఓటు వేయించడం మరో ఎత్తుగా చర్చ జరుగుతున్నది. కార్వాన్, రాజేంద్రనగర్, ఖైరతాబాద్ నుంచి భారీఎత్తున ముస్లిం ఓటర్లను తరలించారని ఆరోపిస్తున్నారు. కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్, ఎమ్మెల్సీ మీర్జా రహమత్‌బేగ్, స్థానిక కార్పోరేటర్ కలిసి భారీఎత్తున నకిలీ ఓటర్లను దిగుమతి చేశారని అంటున్నారు. ఎలాంటి ఎంట్రీ పాస్ లేకున్నా వారిని నేరుగా పోలింగ్ కేంద్రంలోకి తీసుకువెళ్లినట్టు ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా కార్వాన్ ఎంఐఎం ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్, దాదాపు 3,500 మంది మహిళలను తన నియోజకవర్గం నుంచి రప్పించి షేక్‌పేట డివిజన్లో దొంగ ఓట్లు వేయించినట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. హకీం షావలి కాలనీలో ఆటోల్లో పంపి మరీ ఓట్లు వేయించినట్టు వీడియో క్లిప్పింగ్‌లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బోరబండలో బాబా ఫసియుద్దీన్, రహమత్‌నగర్ సీఎన్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీఎత్తున దొంగ ఓటర్లు వచ్చి ఓట్లు వేసినట్టు చర్చ జరుగుతున్నది.
రౌడీషీటర్లు, పోలీసులు మిలాఖత్
జూబ్లీహిల్స్‌లో పోలీసులు, రౌడీషీటర్లు, ఎన్నికల అధికారులు కలిసి కుట్ర చేసినట్టు రాజకీయ పరిశీలకులు ఆరోపిస్తున్నారు. అడ్డూ అదుపు లేదున్నట్టుగా దొంగ ఓటర్లతో ఓట్లు వేయించడం, పోలింగ్ బూత్ వద్దే కుర్చీ వేసుకొని ఓటర్లకు డబ్బులు పంపిణీ చేయడం వంటివి ఉదాహరణలుగా పేర్కొంటున్నారు. అడ్డుకున్నందుకు బీఆర్ఎస్ కార్యకర్తల మీద భౌతిక దాడులకు దిగారని గుర్తుచేస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న వేళ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జూబ్లీహిల్స్‌లో పర్యటిస్తూ పోలీసుల చేత గౌరవ వందనం స్వీకరించడం ఓటింగ్ సరళి మీద తీవ్ర ప్రభావం చూపినట్టుగా చెప్తున్నారు.
ఏడు డివిజన్లలో కలిసి 10 మంది మంత్రులు, 25 మంత్రి ఎమ్మెల్యేలు పదుల సంఖ్యలో ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు బస్తీల్లో మకాం వేసి పోలింగ్ బూత్‌లను తమ అధీనంలోకి తీసుకున్నట్టు ఆరోపణలొచ్చాయి. స్వయంగా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత మీడియాకు ముందుకు వచ్చి ఆరోపణలు చేశారు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటలకు బూత్ క్యాప్చరింగ్ చేసి రిగ్గింగ్ చేసుకున్నట్టు ఆరోపిస్తున్నారు. ఎన్నికల అధికారులు కూడా వీరికి సహకరించినట్టు ఎన్నికల పరిశీలకులు విమర్శిస్తున్నారు. బోరబండ, రహమత్‌నగర్, వెంగళ్రావునగర్, షేక్‌పేట, ఎర్రగడ్డ డివిజన్లలో 81 పోలింగ్ బూత్‌ల్లోకి కాంగ్రెస్ నాయకులు చొరబడి రిగ్గింగ్ చేసుకున్నట్టుగా చెప్తున్నారు.
రూ.300 కోట్ల పంపిణీ
పోటీ అభ్యర్థి ఆస్తులు కుదవబెట్టి రూ.300 కోట్లు తీసుకొచ్చినట్టు ప్రచారం జరుగుతున్నది. ఇవికాకుండా ఏపీ సీఎం చంద్రబాబు కూడా జూబ్లీహిల్స్‌లో మరికొంత డబ్బు సర్దుబాటు చేసినట్టు చర్చ జరుగుతున్నది. ప్రతి ఓటుకు రూ.5 వేల చొప్పున లెక్కగట్టి ఇంటింటికీ పంచిపెట్టిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రతి మహిళకు ఒక చీర చొప్పున లక్షన్నర చీరలు కొనుగోలు చేసి పంపిణీ చేసినట్టు ప్రచారం జరుగుతున్నది. ఒక్కొక్క చీర విలువ రూ.వెయ్యి వరకు ఉంటుందని మహిళలు చెప్తున్నారు. స్థానిక పోలీస్స్టేషన్లు, రెవెన్యూ కార్యాలయాలకు డబ్బు పంపినట్టు ఆరోపణలు ఉన్నాయి.
జూబ్లీహిల్స్‌లో ఓటుహక్కు ఉండి స్థానిక ప్రాంతాలకు వెళ్లిపోయిన దాదాపు 20 వేల మంది ఓటర్లను గుర్తించి, వారి పేర్ల పేద నకిలీ గుర్తింపుకార్డులు ముద్రించారని, రాజేంద్రనగర్, కార్వాన్ నియోజకవర్గాలతోపాటు బీదర్, గుల్బర్గా ప్రాంతాల నుంచి 20 వేల మంది మహిళలను రప్పించి దొంగఓట్లు వేయించారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఒక్కోక్క దొంగ ఓటరుకు రానుపోను ఖర్చు లు, బీరు బిర్యానితో పాటు రూ.2,500 ఇచ్చినట్టు స్థానికులు చెప్తున్నారు. స్థానికంగా ఉన్న ఓటర్లకు ఎన్నికల రోజున ఓటుకు రూ.2,500, ఆఫ్ బాటిల్ మద్యం, కిలో మటన్, మహిళకు చీర చొప్పున పంపిణీ చేసినట్టు చెప్తున్నారు.
ఎన్డీఏతో కాంగ్రెస్ పొత్తు
ప్రీ పోల్ సర్వేలు అన్నీ బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణమైన ఆధిక్యంలో ఉన్నట్టు తేల్చి చెప్పిన నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోయినట్టు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓడిపోతే సీఎం రేవంత్‌రెడ్డికి పదవీగండం పొంచి ఉన్న నేపథ్యంలో పొరుగు రాష్ట్ర సీఎం చంద్రబాబు అప్రమత్తం అయినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ బలపడితే హైదరాబాద్‌లో తమ ఆటలు సాగవని భయపడిన ఆయన జూబ్లీహిల్స్‌లో భారీఎత్తున నిధులు సమీకరించి సర్దుబాటు చేసినట్టు రాజకీయ పరిశీలకులు ఆరోపిస్తున్నారు. తెలంగాణ కమ్యూనిస్టు పార్టీల మీద పెత్తనం చేస్తున్న ఆంధ్ర కమ్యూనిస్టులను ప్రయోగించి కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించేటట్టు ఆయన పావులు కదిపినట్టు చర్చ జరుగుతున్నది.
అదే సమయంలో ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు కేంద్రంలో మోదీని ఒప్పించి జూబ్లీహిల్స్‌లో బీజేపీ నేతలను కట్టడి చేశారని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడం కోసం ఉపయోగపడేలా బీజేపీ పోటీని నామమాత్రంగా మలిచారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇద్దరు కేంద్ర మంత్రులు, 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నా ఎవరినీ ప్రచారంలోకి రాకుండా నిలువరించారని చర్చ జరుగుతున్నది. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ బీజేపీకి మద్దతు ప్రకటించి ఆ పార్టీలో జోష్ తీసుకు వచ్చే ప్రయత్నం చేశారు. కానీ బీజేపీ నేతలు మాత్రం జూబ్లీహిల్స్‌లో ప్రచారం చేసి ఓటర్లలో చైతన్యం తీసుకురావడానికి కనీస ప్రయత్నం చేయకపోవటం గమనార్హం. ఇలా అధికార వ్యవస్థలు, రాజకీయ పక్షాలన్నీ కలిసి జూబ్లీహిల్స్‌లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాయని రాజకీయ విశ్లేషకులు ఆరోపిస్తున్నారు.