Government Hospital | హుజూర్నగర్, సెప్టెంబర్ 18 : పుట్టబోయే బిడ్డపై ఎన్నో ఆశలు.. సర్కారు దవాఖానపై ఎంతో నమ్మకం పెట్టుకొని వచ్చిన ఆ నిండు గర్భిణి నరకం చూసింది. పురిటి నొప్పులు రావాలని, సాధారణ ప్రసవం కావాలని సిబ్బంది చేసిన నిర్వాకంతో మానసికంగా, శారీరకంగా వేదన అనుభవించింది. బూతులు తిట్టినా.. ఇష్టంవచ్చినట్టు కొట్టినా పుట్టబోయే బిడ్డ కోసం భరించింది.
పండంటి బిడ్డ చేతిలోకి వస్తుందని వారు ఎంత ఇబ్బంది పెట్టినా తట్టుకొని ఎదురు చూసిన ఆ తల్లికి చివరికి ఏడుపే మిగిలింది. డ్యూటీ డాక్టర్లు అందుబాటులో లేక.. సర్కారు దవాఖానలో నర్సులు చేసిన అమానవీయ వైద్యం ఓ పసికందు ప్రాణం తీసింది. నొప్పుల కోసం గర్భిణిని తిడుతూ కొడుతూ చివరికి సాధారణ ప్రసవం కోసం పొట్టపై తొక్కడంతో పుట్టిన శిశువు కొద్దిసేపట్లోనే మృతిచెందింది. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ ఏరియా దవాఖానలో మంగళవారం ఈ దారుణం జరిగింది. బాధిత కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం.. మఠంపల్లి మండలం గుర్రంబోడు తండాకు చెందిన పాసిపాక నాగరాజు భార్య రేణుకకు ఆదివారం పురిటి నొప్పులు రావడంతో హుజూర్నగర్ ఏరియా దవాఖానకు తీసుకొచ్చారు.
ఆ సమయంలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో నర్సులు అడ్మిట్ చేసుకున్నారు. రాత్రి వరకూ వైద్యం అందించకపోవడంతో నాగరాజు సిబ్బందిని ప్రశ్నించగా రేణుకను తిడుతూ నొప్పులు రావాలని చెప్పి ఆమె పొట్టపై కాలుతో తొక్కారు. సోమవారం తెల్లవారుజామున సాధారణ ప్రసవం చేసి బాబును బయటకు తీసినా, శిశువు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో సూర్యాపేట ఏరియా వైద్యశాలకు రెఫర్ చేశారు. నాగరాజు కుటుంబ సభ్యులు శిశువును తీసుకుని అక్కడికి వెళ్లగా, పరిస్థితి విషమించి పసికందు మృతిచెందాడు.
ఈ ఘటనపై నాగరాజు సూర్యాపేట డీఎంహెచ్వో కోటాచలానికి, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో డీఎంహెచ్వో హుజూర్నగర్ ఏరియా వైద్యశాలకు వచ్చి విచారణ చేపట్టారు. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. శిశువు పోస్టుమార్టమ్ రిపోర్ట్ వివరాలు తీసుకుంటామని తెలిపారు. కాగా, డెలివరీ కోసం ప్రభుత్వ దవాఖానకు వస్తే డ్యూటీ డాక్టర్ విధుల్లో లేరని, నర్సులు అమానవీయంగా ప్రవర్తించారని డీఎంహెచ్వో ఎదుట రేణుక కన్నీటిపర్యంతమైంది. నిండు గర్భంతో ఉన్న తనను నర్సులు బూతులు తిడుతూ కొట్టారని, కడుపుపై తొక్కారని బోరున విలపించింది. డ్యూటీ డాక్టర్తో పాటు నర్సులపై చర్యలు తీసుకోవాలని రోదిస్తూ చెప్పింది.
హుజూర్నగర్ ఏరియా దవాఖాన వైద్య సిబ్బంది నిరక్ష్యం వల్లే మా బిడ్డ చనిపోయాడు. సకాలంలో వైద్యం చేయకుండా జాప్యం చేశారు. డాక్టర్ లేకుండా నర్సులు ఇష్టం వచ్చినట్టు వైద్యం చేసి పసిబడ్డను బలితీసుకున్నరు. నిరక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
-పాసిపాక నాగరాజు