హైదరాబాద్, జూన్28 (నమస్తే తెలంగాణ)/మేడ్చల్/మియాపూర్: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పరిధిలో భారీ భూ ఆక్రమణకు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని, ఆయన బినామీలు పకా సెచ్ వేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రూ.వేలాది కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమించడానికి తీవ్ర ప్రయత్నాలు సాగుతున్నట్టు తెలుస్తున్నది. అధికార బలాన్ని అడ్డుపెట్టుకొని జరుగుతున్నట్టు తెలుస్తున్న ఈ భారీ ల్యాండ్ సామ్ విషయం ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నది. హైదరాబాద్ ఐటీ కారిడార్ విస్తరణ కోసం టీజీఐఐసీ (తెలంగాణ గ్రీన్హౌస్ అండ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్)కి కేటాయించిన అత్యంత విలువైన 112.72 ఎకరాల ప్రభుత్వ భూమిపై ల్యాండ్ మాఫియా కన్నుపడింది.
ప్రగతినగర్ శంషీగూడ పరిధిలోని సర్వేనంబర్ 57లో ఉన్న ఈ భూమికి మారెట్లో రూ.వేలాది కోట్ల విలువ ఉంటుందని అంచనా. ఈ స్థలం కబ్జాకు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని, ఆయన బినామీలు యత్నిస్తున్నారంటూ తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి ఎంపీ చిన్ని సొంత సోదరుడు, మాజీ ఎంపీ కేశినేని నాని సోషల్ మీడియా వేదికగా బహిరంగ లేఖ రాశారు. భూ ఆక్రమణలను తక్షణమే నిలిపివేసి, బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నాని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇది రాజకీయ, రియల్ ఎస్టేట్ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నది.
ఈ భారీ భూకుంభకోణం వెనుక ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ప్రధాన సూత్రధారిగా వ్యవహరిస్తూ, తన కుటుంబసభ్యుల బినామీ నెట్వర్తో వ్యవహారం నడుపుతున్నట్టు ఆరోపణలున్నాయి. ఎం/ఎస్ ఎక్సెల్లా ప్రాపర్టీస్ అనే సంస్థ వెనుక మేనేజింగ్ పార్టనర్ అయిన ఎంపీ కుమారుడు కేశినేని వెంకట్చౌదరి, ఇతర బినామీలు ఉండి నడిపిస్తున్నట్టు ఆ లేఖలో ఆధారాలు సహా నాని పేరొన్నారు. ఈ ల్యాండ్ గ్రాబింగ్ కోసం సదరు సంస్థ అత్యున్నత న్యాయస్థానాన్ని సైతం తప్పుదోవ పట్టించేందుకు సాహసించిందని ఆరోపణలొచ్చాయి. ఆర్టికల్ 142 కింద మోసపూరిత ప్రైవేట్ రాజీ పిటిషన్లు (ఐఏ నం.240414 /2025 & ఐఏ నం. 40600/2026) దాఖలు చేసి అడ్డదారిలో ఆర్డర్లు పొందేందుకు ప్రయత్నించిందని ఆరోపణలున్నాయి.
జిల్లా కలెక్టరేట్ రికార్డుల్లో ఈ భూమికి ఎటువంటి ప్రైవేట్ యాజమాన్య హక్కులు లేవు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ నాటి కౌంటర్ అఫిడవిట్లో సర్వేనంబర్ 57లో మొత్తం 274.33 ఎకరాల (వివాదాస్పదమైన 112.72 ఎకరాలు సహా) పోరంబోకు సర్కారీ (ప్రభుత్వ) భూమిగా నమోదై ఉన్నది. అప్పటికే అస్మాన్జాహీ వారసుల ప్రైవేట్ హక్కుల వాదనలను అతియత్ కోర్టు 25-11-1957, రెవెన్యూ బోర్డు 6-15-1976 తిరస్కరించాయి. దీనిపై ఏ ప్రైవేట్ వ్యక్తికీ ఎటువంటి హకు లేదని కలెక్టర్ స్వయంగా అఫిడవిట్ సమర్పించినా కూడా ఈ ల్యాండ్ గ్రాబింగ్ ఆగకపోవడం గమనార్హం. కోర్టు పరిధిలో వ్యవహారాలు నడుపుతూనే, మరోవైపు క్షేత్రస్థాయిలో భూమిని ఆధీనంలోకి తెచ్చుకొనేందుకు సదరు సంస్థ తెగబడిందని స్థానికులు సహా చెప్తున్నారు. శంషీగూడ నాగమ్మ టెంపుల్ సమీపంలో అర్ధరాత్రి వేళ భారీ జేసీబీలు, ప్రైవేట్ సెక్యూరిటీతో సిండికేట్ ముఠా చొరబడి, ప్రభుత్వ భూమి చుట్టూ అక్రమంగా బారికేడ్లు నిర్మిస్తుండగా స్థానికుల్లో కలకలం రేగింది.
శంషీగూడ 57సర్వేనంబర్‌లోని 112 ఎకరాల స్థలాన్ని తెలంగాణ ప్రభుత్వం తక్షణమే స్వాధీనం చేసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి సహా వివిధ శాఖలను మాజీ ఎంపీ నాని సహా పలువురు కోరుతున్నారు. ఆక్రమణల తొలగింపు చర్యల కోసం హైడ్రాకు అధికారం ఇవ్వాలని కోరారు. ఇదే విషయంపై సీఎం రేవంత్‌రెడ్డితోపాటు హైడ్రా కమిషనర్, టీజీఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్, రెవెన్యూ, పరిశ్రమల ఐటీ, మేడ్చల్-మల్కాజిగిరి కలెక్టర్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, రెరా చైర్మన్‌కు మాజీ ఎంపీ కేశినేని నాని ఫిర్యాదులు అందజేశారు. ప్రభుత్వ భూమి ఆక్రమణలకు పాల్పడినందున ఎంపీ కేశినేని శివనాథ్, కేశినేని వెంకటచౌదరి, మెస్సర్, ఎక్సెల్లా ప్రాపర్టీస్ ఇతర భాగస్వామ్యులపై కేసులు నమోదు చేయాలని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతోపాటు హైదరాబాద్ సమీపంలో మరిన్ని దోపిడీలకు వీరు పాల్పడ్డారని, ఉనికిలో లేని ప్రాజెక్టుల్లో ప్లాట్లు ఇప్పిస్తామని మధ్యతరగతి కుటుంబాలను ఆకర్షించి రూ.వందలాది కోట్లు దోచుకున్నట్టు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి పొరుగు రాష్టంలో అధికారంలో ఉన్న తెలుగుదేశంతో సత్సంబంధాలు ఉండటం, ఎంపీ కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని సిట్టింగ్ ఎంపీ కావడంతో ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటారోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది.
మాజీ ఎంపీ కేశినేని నాని రాజకీయ స్వార్థం, ఈర్ష్య, ఉనికి కోసమే తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) పేరొన్నారు. ఆయన రాసిన లేఖల్లో ఒక శాతం కూడా వాస్తవం లేదని తెలిపారు.