ఖైరతాబాద్, డిసెంబర్ 26: పత్రికలు, చానెళ్లలో డెస్క్ జర్నలిస్టుల అక్రెటిడేషన్ల రద్దు పత్రికా స్వేచ్ఛపై దాడిగా భావిస్తున్నామని తెలంగాణ మీడియా అకాడమీ మాజీ చైర్మన్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ తెలిపారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అక్రెడిటేషన్లపై ప్రభుత్వం వైఖరి, కొత్త జీవో, మీడియా అకాడమీ తీరు ను ఎండగట్టారు. ఎన్నడూ లేనిది రెండు కార్డుల సిద్ధాంతంతో జర్నలిస్టుల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం జరుగుతున్నదని మండిపడ్డారు. వార్తల సేకరణలో ఫీల్డ్ జర్నలిస్టుల పాత్ర ఎంత కీలకమో, వార్తను తీర్చిదిద్దడంలో డెస్క్ జర్నలిస్టుల పాత్ర అంతే కీలకమని తెలిపారు. డెస్క్ జర్నలిస్టులపై ప్రస్తుత మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి పగబట్టినట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
ప్రత్యేక రాష్ట్రం సిద్ధ్దించిన తర్వాత నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ జారీ చేసిన జీవో 239 జర్నలిస్టుల సంక్షేమానికి ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. ఉద్యమంలో పాల్గొన్న ప్రతి జర్నలిస్టుకూ బేధం లేకుండా అక్రెడిటేషన్లు ఇవ్వాలని, అన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయాలని స్పష్టం చేశారని గుర్తు చేశా రు. దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ నిధికి రూ.100 కోట్లతో నిధులు ఏర్పాటు చేయడానికి సంకల్పించి, రూ.42 కోట్లు కేటాయించారని తెలిపారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 23 వేల మందికి అక్రెడిటేషన్లు ఇచ్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని చెప్పారు. కల్చరల్, స్పోర్ట్స్ రిపోర్టర్లకు ప్రత్యేక అక్రెడిటేషన్లు ఇచ్చిన సంప్రదాయాన్ని ఇప్పుడు పూర్తిగా రద్దు చేయడం అన్యాయమని మండిపడ్డారు. అక్రెడిటేషన్ల కోత జర్నలిస్టు వృత్తికి తీరని నష్టమని, పెద్ద పత్రికలు, పెద్ద చానళ్లకే కాకుండా చిన్న, మాధ్యమిక పత్రికలు, శాటిలైట్, కేబుల్ చానెళ్లను కూడా నిర్లక్ష్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. డెస్క్ జర్నలిస్టులను ద్వితీయశ్రేణి పౌరులుగా చూస్తూ మీడియా కార్డు పేరుతో వారి అక్రెడిటేషన్లను రద్దు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. జర్నలిస్టుల హక్కుల కోసం పోరాటంలో టీయుడబ్ల్యూజే ఎల్లవేళలా ముందుంటుందని తెలిపారు.
గత ప్రభుత్వం ఇచ్చిన అక్రెడిటేషన్లలో సగానికి పైగా ప్రస్తుత ప్రభుత్వం కోత విధించడం, ఫ్రీలాన్స్ జర్నలిస్టుల అర్హతను పదేండ్ల నుంచి పదిహేనేండ్లకు పెంచడం సీనియర్ జర్నలిస్టుల హక్కులను హరించడమేనని టీ యుడబ్ల్యూజే రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఆస్కాని మారుతీసాగర్ మండిపడ్డారు. జీవో 252ను సవరించాలని, లేదా ఉపసంహరించాలని, లేని పక్షంలో జర్నలిస్టుల ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
జీవోకు నిరసనగా నేడు 33 జిల్లాల్లో కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని, తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ని ఫీల్డ్, డెస్క్ జర్నలిస్టులంతా ఐక్యంగా నిరసనల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మావేశంలో టీయుడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేశ్ హజారి, కోశాధికారి యోగానంద్, టీజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణకుమార్, ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యుడు అవ్వారి భాస్కర్, హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి నవీన్‌కుమార్, ఉపాధ్యక్షుడు మల్లేశ్, సుదర్శన్రెడ్డ్డి, కోశాధికారి బాపురావు పాల్గొన్నారు.