ఖైరతాబాద్, మే 28 : ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన 12 ఏండ్ల తర్వాత కూడా పరాయి పాలకులకు ఇంకా తెలంగాణ నేలపై అక్కసుపోలేదని తెలంగాణ మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ ఆక్రోశం వెళ్లగక్కారు. ఒకప్పుడు అసెంబ్లీలో తెలంగాణ పదాన్నే తెలుగుదేశం పార్టీ నిషేధించిస్తే.. నిన్న తెలంగాణ టీడీపీకి చెందిన ఓ దళారి తెలంగాణ పదమే లేదంటూ వ్యాఖ్యానించాడని.. ప్రస్తుతం అమీర్‌పేట మైత్రివనంలో కామ్రేడ్ ఎన్టీఆర్ విగ్రహాన్ని కామ్రేడ్ రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారని.. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఇంకా తెలంగాణ అస్తిత్వంపై దాడులు ఆగలేదని స్పష్టమవుతుందని పేర్కొన్నారు. ఇప్పటికైనా తెలంగాణ సమాజం ఆలోచించుకోకుంటే చాలా కష్టాలు వస్తాయని అభిప్రాయపడ్డారు.
గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సీనియర్ జర్నలిస్టు సుగ్గునూతుల యాకయ్య రచించిన ‘గోలకొండ పత్రిక సాహిత్య, సాంస్కృతిక చైతన్యం’ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ప్రొఫెసర్ కోదండరాం, సీనియర్ సంపాదకులు కట్టా శేఖర్‌రెడ్డి, కె రామచంద్రమూర్తి, ఎన్ వేణుగోపాల్‌తో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్లం నారాయణ మాట్లాడుతూ తెలంగాణ చరిత్రకు ఒక ఉమ్మడి గతం ఉన్నదని, తర్వాత క్రియాశీల వర్తమానం, ఆ తర్వాత భవిష్యత్తు ఉందని, దాని నుంచే మనం నేర్చుకుంటున్నామని చెప్పారు.
ముఖ్యంగా 1969 ఉద్యమానికి 16 సంవత్సరాల ముందే ఈ ప్రాంతంలో ఉన్న పరిణామాలను వెలుగులోకి తెచ్చిన ఘనత గోలకొండ పత్రిక ఎడిటర్ సురవరం ప్రతాప్‌రెడ్డికే దక్కుతుందని తెలిపారు. భారతదేశంలో హైదరాబాద్ విలీనం, ఆ తర్వాత భాషా ప్రయుక్తరాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరణ, ఆ తర్వాత పరిణామాల చరిత్ర గోలకొండ పత్రికలో దొరుకుతాయని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా రోశయ్య, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలో మానుకొండ చలపతిరావు విగ్రహాలు పెట్టారని, కానీ అక్కడ సురవరం ప్రతాప్‌రెడ్డి విగ్రహాన్ని పెట్టాల్సి ఉన్నదని చెప్పారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌కు సైతం సురవరం నామకరణం చేయాలని సూచించారు.
కట్టా శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ నాడు తెలంగాణ జర్నలిస్టులందరూ ఈ ప్రాంత చరిత్రను తెలుసుకొనే ప్రయత్నం జరుగుతున్న తరుణంలో విలీనం కాలం, ఉమ్మడి రాష్ట్రంలో ఏం జరిగింది?, ఎలాంటి వక్రీకరణలు జరిగాయి?, చెన్నై నుంచి ఆంధ్రా విడిపోయినప్పుడు ఏం జరిగిందనే విషయాలను గోలకొండ, ఆంధ్రపత్రిక, ఆంధ్రభూమి పత్రికలను తిరిగేసి సమాచారాన్ని సేకరించారని గుర్తుచేశారు. ఆంధ్రుల చరిత్ర గురించి సురవరం ప్రతాప్‌రెడ్డి రాశారు కానీ, తెలుగు అంటూ రాయలేదని చెప్పారు.
త్రిలింగ, తెలింగ నుంచి తెలంగాణ వచ్చిందని, ఆంధ్రా అనేది మనపై రుద్దారని, ఉత్తర భారత సంస్కృత పండితులు ఆంధ్రా అనే పదాన్ని తీసుకొచ్చి తెలుగుకు తగిలించారని కొన్ని పుస్తకాలు రాశాయని పేర్కొన్నారు. ఇలాంటి తవ్వితే చాలా అంశాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు. కేయూ విశ్రాంత ప్రొఫెసర్ కాత్యాయనీ విద్మహే అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రచయిత, పరిశోధకుడు డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్ట్ చిల్ల మల్లేశం, హేతువాత సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి ఎస్ వేదాంత, కాకతీయ ప్రభుత్వ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ గండు మహేందర్ తదితరులు పాల్గొన్నారు.