హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ) : ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని దక్కించుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు తెలంగాణలోనూ తమ పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. అందులో భాగంగా ఆదివారం హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీటీడీపీ నేతలతో భేటీ అయ్యారు. టీటీడీపీని బలోపేతం చేయడంతోపాటు పార్టీ రాష్ట్ర శాఖ నూతన అధ్యక్షుడి ఎంపిక, సభ్యత్వ నమోదు, పంచాయతీ ఎన్నికల్లో పోటీకి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. టీటీడీపీకి చెందిన గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రస్థాయి కమిటీలన్నింటినీ రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. త్వరలో టీటీడీపీ అధ్యక్షుడి ఎంపికతోపాటు నూతన కమిటీలను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. ఆన్లైన్లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.
చంద్రబాబుతో బాబూమోహన్ భేటీ
సినీనటుడు, మాజీ మంత్రి బాబూమోహన్ ఆదివారం హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు వచ్చారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడును కలసి, కొద్దిసేపు మాట్లాడిన బాబూమోహన్ ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. దీంతో ఆయన మళ్లీ టీడీపీలో చేరనున్నట్టు ప్రచారం జరుగుతున్నది.