Telangana | హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గరిష్ఠ విద్యుత్తు డిమాండ్ రికార్డుస్థాయిలో నమోదైంది. మొదటిసారిగా పీక్ డిమాండ్ 16,506 మెగావాట్లు దాటింది. ఫిబ్రవరి 25న ఉదయం 8:03 గంటల సమయంలో అత్యధిక డిమాండ్ 16,506 మెగావాట్లు నమోదైందని అధికారులు వెల్లడడించారు. ఇప్పటివరకు ఇదే రికార్డు అని తెలిపారు. ఈ నెల 21న మధ్యాహ్నం 12 గంటల్లో గరిష్ఠ డిమాండ్ 16,412 మెగావాట్లు నమోదుకాగా, మంగళవారం ఉదయం 8గంటలకే 16,503 మెగావాట్లుగా నమోదైంది. రాష్ట్రంలో 8వేల మెగావాట్లు విద్యుత్తు ఉత్పత్తి అవుతుండగా, ప్రభుత్వం మరో 8వేల మెగావాట్లను ఇతర రాష్ర్టాల నుంచి కొనుగోలు చేస్తున్నది.
ఇప్పుడే ఇలా ఉంటే.. సంక్షోభం తప్పదా!
విద్యుత్తు వినియోగం విషయానికి వస్తే ఫిబ్రవరి 25న 313. 373 మిలియన్ యూనిట్లుగా నమోదైంది. నిరుడు ఫిబ్రవరి 21న 313.36 మిలియన్ యూనిట్ల విద్యుత్తు వినియోగమైంది. ఉదయం వేళల్లో డిమాండ్, వినియోగం గరిష్ఠ స్థాయికి చేరి, ఆ తర్వాత క్రమంగా 9వేల మెగావాట్లకు పడిపోతున్నది. ఉదయం వేళల్లోనే రైతులు పొలాలకు నీళ్లు పారించేందుకు మోటార్లు ఆన్ చేస్తారు. వేడి తీవ్రతలు అధికంగా ఉండటం వల్ల కూడా ఎక్కువగా నీరు పారించాల్సిన అవసరం ఏర్పడుతున్నది. అందుకే అత్యధిక డిమాండ్ నమోదవుతున్నదని నిపుణులు చెప్తున్నారు. వేసవి, వేడి తీవ్రతతో గృహ వినియోగం కూడా అధికమైందని వివరిస్తున్నారు. ఉదయాన్నే సోలార్ విద్యుత్తు కూడా ఎక్కువగా ఉత్పత్తి కావడం లేదని, విద్యుత్తు ఎక్స్చేంజీలో విద్యుత్తును కొనాల్సి వస్తుందని అధికారులు చెప్తున్నారు. మరోవైపు ప్రభుత్వ విద్యుత్తు ఉత్పత్తిపై, భారీ సరఫరాను తట్టుకునేలా వ్యవస్థల నిర్మాణం, మరమ్మతులలో సన్నద్ధంగా లేదని నిపుణులు చెప్తున్నారు. దీంతో విద్యుత్తు సంక్షోభంతో పాటు సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్ల కాలిపోయే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.