హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, ఉద్యోగ వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు ఉద్యోగులంతా ఏకమవుతున్నారు. అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య (ఏఐజీఈఎఫ్) నేతృత్వంలో ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. 28 రాష్ర్టాల్లోని ఉద్యోగులంతా కలిసి త్వరలోనే బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌తో సమావేశం కావాలని నిర్ణయించారు.
బుధవారం ఏఐజీఈఎఫ్ అధ్యక్షుడు సుభాష్ లాంబ, ఉపాధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ నేతృత్వంలో సంఘం ప్రతినిధి బృందం సీఎం కేసీఆర్‌ను కలిసి పలు అంశాలపై చర్చించింది. ఇటీవల ఫరీదాబాద్‌లో నిర్వహించిన సమావేశాల్లో చర్చించిన అంశాలను కేసీఆర్‌కు వివరించారు. ఉద్యోగుల ఆదాయం పన్ను స్లాబుల పెంపు, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ తదితర అంశాలపై కేసీఆర్‌తో చర్చించారు. సీఎంను కలిసినవారిలో టీఎన్జీవో, టీజీవో, ట్రెసా, పీఆర్టీయూ టీఎస్ తదితర సంఘాల నేతలున్నారు.