హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): అడవుల్లో వన్యమృగాల కదలికలు, స్మగ్లర్ల చొరబాట్లు, అడవుల్లో మంటలు చెలరేగడం, అడవుల్లో మూలమూలన ఎవరెవరూ సంచరిస్తున్నారనే సమాచారం క్షణాల్లో తెలుసుకొనేందుకు తెలంగాణ అటవీశాఖ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్నది. వన్యప్రాణుల రక్షణతో పాటు అడవుల్లో ప్రతి కదలికను గుర్తించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను వినియోగించాలని నిర్ణయించింది. ఇందుకోసం ముంబై కేంద్రంగా పనిచేస్తున్న స్టార్టప్ సంస్థ థింక్ ఎవాల్వ్ కన్సల్టెన్సీతో ఇటీవల ఒప్పందం చేసుకొన్నది. ఈ ఒప్పందం ద్వారా అడవుల్లోని మొత్తం జంతువుల సంఖ్యను లెక్కించడంతోపాటు వివిధ కారణాలతో గాయపడిన వన్యమృగాలను గుర్తించి, వాటికి తక్షణ చికిత్స అందించేందుకు అవసరమైన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుంది.
ఇప్పటికే ప్రభుత్వం అడవుల్లో సీసీ కెమెరాలు అమర్చింది. వీటిని జీపీఎస్‌తో అనుసంధానించి, ఆయా ఫొటోలు, వీడియోలను ఈ సంస్థ విశ్లేషిస్తుంది. గరిష్ఠంగా లక్ష కెమెరాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు విశ్లేషించ గల సామర్థ్యం థింక్ ఎవాల్వ్ సంస్థకు ఉన్నదని చెప్తున్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో అడవుల్లోని పులుల సంఖ్యను మాత్రమే కాకుండా ఇతర జంతువుల సంఖ్యను కూడా లెక్కించే అవకాశం లభించనున్నది. వీటిని శాకాహార, మాంసాహార జంతువుల వారీగా కూడా గణించవచ్చు. ఈ సంస్థ అభివృద్ధి చేసిన స్మార్ట్ ఇంటిగ్రేటెడ్ డ్యాష్ బోర్డ్ ద్వారా గాయపడ్డ జంతువుల కదలికలను గుర్తించి వివరాలను అధికారులకు అందిస్తుంది. దీంతో వాటికి వెంటనే చికిత్స అందించే అవకాశం ఏర్పడుతుంది. వన్యప్రాణులను మారణాయుధాలతో వేటాడుతున్నవారి కదలికలను సైతం గుర్తించి సమాచారాన్ని అధికారులకు చేరవేస్తుంది. రాష్ట్రంలోని అడవుల్లో ఎన్ని రకాల పక్షులున్నా యో కూడా లెక్కగడుతుంది. తద్వారా భిన్న జాతుల పక్షులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బర్డ్ వాచింగ్ పేరుతో పర్యాటకాన్ని అభివృద్ధి చేసే వీలున్నదని అధికారులు చెప్తున్నారు.
త్వరలో పనులు ప్రారంభిస్తాం
అటవీ జంతువుల రక్షణలో ఎదురవుతున్న సమస్యలకు పరిష్కారం చూపించాలన్న తెలంగాణ ప్రభుత్వ ఆహ్వానం మేరకు సామాజిక బాధ్యతలో భాగంగా ఏఐ ఆధారిత స్మార్ట్ ఇంటిగ్రేటెడ్ డ్యాష్ బోర్డ్‌ను అభివృద్ధి చేసినట్టు థింక్ ఎవాల్వ్ కన్సల్టెన్సీ సీఈ వీ ఆకాష్ గుప్తా తెలిపారు. ఇటీవల రాష్ట్ర అటవీశాఖతో ఒప్పందం కుదిరిందని, త్వరలో పనులు ప్రారంభిస్తామని చెప్పారు. వన్యప్రాణుల రక్షణకు ఇలాంటి టెక్నాలజీ వాడటం దేశంలోనే మొదటిసారి అని పేర్కొన్నారు. – థింక్ ఎవాల్వ్ కన్సల్టెన్సీ సీఈవీ ఆకాశ్గుప్తా