కరీంనగర్, జూలై 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రంలో వివిధ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నడుస్తున్న వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలు, గురుకులాలు, కస్తూర్బా పాఠశాలల్లో అన్నిరకాల టెండర్లను కార్పొరేట్ సంస్థలకే అప్పగించే దిశగా సర్కారు అడుగు లు వేస్తున్నది. ప్రస్తుతం ఉన్న స్థానిక కాంట్రాక్టర్ల వ్యవస్థకు మంగళం పాడి, కేంద్రీకృత టెండర్ విధానం తేవాలని యోచిస్తున్నది. అందులో భాగంగా ఇప్పటికే కోడిగుడ్లు, నూనె సరఫరా కోసం టెండర్లు పిలుస్తుండగా, మిగతా క్యాటరింగ్, కిరాణం, పండ్లు, కూరగాయలు, చికెన్, మటన్ వంటి వాటి సరఫరాను సైతం కార్పొరేట్ పరంచేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తున్నది. అదే జరిగితే ఏండ్ల తరబడిగా ఈ సంక్షేమ గృహాలనే నమ్ముకొని వివిధ రకాల వస్తులను సరఫరా చేస్తున్న వేలాది మంది స్థానిక కాంట్రాక్టర్లు, వారి పరిధిలో పనిచేస్తున్న వేలాది కుటుంబాలు, రోడ్డున పడే అవకాశం ఉన్నదన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. స్థానికంగా ఉన్న కాంట్రాక్టర్లకు మంగళం పాడి, కార్పొరేట్ కంపెనీలకు టెండర్లు అప్పగించే విషయంలో అధికార పా ర్టీకి చెందిన బడా నేత చక్రం తిప్పుతుండగా, అంతా తెలిసినా మంత్రులు సైతం మౌనం వహిస్తున్నట్టు సమాచారం.
ప్రస్తుత కాంట్రాక్టు వ్యవస్థకు మంగళం
మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల, తెలంగాణ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాసంస్థల సొసైటీ, తెలంగాణ మైనార్టీస్ రెసిడెన్షియల్ స్కూళ్లు, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ, కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాలతోపాటు వివిధ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో రాష్ట్రంలో 1,000కిపైగా గురుకుల విద్యాసంస్థలు నడుస్తున్నాయి. వీ టికి కూరగాయలు, చికెన్, మటన్, కోడిగుడ్లు, పండ్లు, కిరాణం, పాలు, క్లీనింగ్ శానిటేషన్ వంటి ఒక్కో విభాగానికి ఒక్కో కాంట్రాక్టర్ పనిచేస్తున్నారు. అంటే వివిధ సంక్షేమ శాఖల పరిధిలో నడుస్తున్న ఒక్కో రెసిడెన్షియల్ విద్యాసంస్థ పరిధిలో దాదాపు 8 మంది కాంట్రాక్టర్లు పనిచేస్తున్నారు.
వీరంతా ఎక్కడికక్కడే స్థానికంగా ఉంటూ.. వారి పరిధిలో మరో ఐదు నుంచి 10 మందికి ఉపాధినిస్తూ కాంట్రాక్టు పనులు చేస్తున్నారు. ప్రభుత్వం వెనుకా ముందు డబ్బు ఇచ్చినా ఏండ్ల తరబడిగా ఇదే కాంట్రాక్టు పనులు చేస్తూ వస్తున్నారు. బ్యాంకు రుణాలు తీసుకుంటూ పనులు చక్కబెడుతూ వస్తున్నారు. నిజానికి ఈ సరఫరాకు సంబంధించి.. దాదాపు నాలుగునెలల బిల్లులు ఇంకా కాంట్రాక్టర్లకు రావాల్సి ఉన్నది. అలాగే ఏటా మే చివరి వారం లేదా జూన్ మొదటివారంలో టెండర్లను పిలుస్తారు. కానీ, ఈసారి పిలువకపోగా ‘కొత్త కాంట్రాక్టర్ వచ్చేవరకు మీరే సరఫరా చేయాలి’ అంటూ ఆదేశాలు ఇస్తున్నారు. అదేప్రకారం సదరు కాంట్రాక్టర్లు సరఫరా చేస్తున్నారు. ఇటీవల జరుగుతున్న పలు పరిణామాలను చూస్తే పాత కాంట్రాక్టర్ల వ్యవస్థకు మంగళంపాడి, కార్పొరేట్ సంస్థలకు కాంట్రాక్టు పనులు అప్పజెప్పే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
కార్పొరేట్ వైపు అడుగులు?
గతంలో రెసిడెన్షియల్ విద్యాసంస్థలకు స్థానికంగా ఉన్న కాంట్రాక్టర్లు నిర్ణీత నిబంధనల ప్రకారం గుడ్లను సరఫరా చేశారు. ప్రస్తుతం వీరిని పక్కనబెట్టి ప్రభుత్వం కొత్త ఆదేశాలను జారీచేసింది. అందుకోసం పెట్టిన నిబంధనలు ఇతర వివరాలను పరిశీలిస్తే బడా కాంట్రాక్టర్లు ముఖ్యంగా కార్పొరేట్ సంస్థలకు ఎలా పెద్దపీట వేయాలని అనుకుంటున్నదని తెలుస్తున్నది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇటీవల వివిధ జిల్లాల్లోని గురుకుల విద్యాసంస్థలకు గుడ్లు సరఫరా చేయడానికి టెండర్ పిలుస్తున్నారు. ఈ టెండర్ కోసం పెట్టిన నిబంధనలు స్థానికంగా ఉన్న ఏ కాంట్రాక్టర్కు కానీ, రైతులకు గానీ ప్రయోజనం చేకూర్చేలా లేవన్న విమర్శలు వస్తున్నాయి. ఒక వైపు రైతుల పేర్లు చెబుతూనే మరోవైపు సర్కారు పెట్టిన నిబంధనలన్నీ, ఏ ఒక్క పౌల్ట్రీరైతు అందుకోలేని విధంగా ఉన్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిబంధనల వల్ల 20 ఏండ్లుగా ఈ వృత్తిలో ఉన్న స్థానిక కాంట్రాక్టర్లు ఎవరూ కూడా టెండర్లో పాల్గొనే అవకాశం లేకుండా పోతుందని చెప్తున్నారు.
ఊడనున్న ఉపాధి.. చక్రం తిప్పుతున్న నేత?
రాష్ట్రంలో 1,000కిగా పైగా రెసిడెన్షియల్ విద్యాలయాలు ఉన్నాయి. రాష్ట్రంలో దాదాపు 40 నుంచి 50 వేల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడుతున్నారు. ఈ దశలో కాంట్రాక్టును కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తే ఆ వేలాది కుటుంబాలు రోడ్డున పడుతాయన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. ప్రస్తుత కాంట్రాక్టర్లు ఇటీవలే సంబంధిత మంత్రులను కలిసి, గతంలో మాదిరిగా టెండర్లు నిర్వహించాలని, తమకు రావాల్సిన నాలుగు నెలల పెండింగ్ బిల్లులను ఇప్పించాలని కోరుతూ వినతిపత్రాలు సమర్పించారు. అయితే ప్రభుత్వం మాత్రం గతంలో మాదిరిగా టెండర్లు నిర్వహించకుండా రైతులు, ఇతరులు అంటూ వివిధ వర్గాల పేరుతో కార్పొరేట్ సంస్థలకు ఈ కాంట్రాక్టులన్నీ అప్పగించేలా చర్యలు తీసుకుంటున్నదని అనుమానం కలుగుతున్నది. ఇందుకోసం కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ కీలక నేత చక్రం తిప్పుతున్నారని సమాచారం. ఆయన వివిధ వస్తువుల సామగ్రి సరఫరాకు సంబంధించి ముందుగానే మాట్లాడుకొని, సంబంధిత సంస్థలకు మాత్రమే టెండర్లు వచ్చేలా నిబంధనలు పెట్టి, టెండర్ నోటిఫికేషన్లు జారీ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తున్నది.