చిక్కడపల్లి, డిసెంబర్ 28: దేశానికి ఫాసిస్టు ప్రమాదం పొంచి ఉన్న ఈ సమయంలో దేశంలోని విప్లవకారులందరూ ఐక్యం కావాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జాతీయ అధికార ప్రతినిధి దర్శన్‌సింగ్ కట్కర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ రెండు గ్రూపుల విలీనసభలో ఆయన మాట్లాడారు. రెండు తెలుగు రాష్ర్టాల్లో బలమైన రెండు విప్లవ స్రవంతులు ఐక్యంకావడం విప్లవ ఉద్యమానికి మరింత బలం చేకూర్చుతుందని చెప్పారు.
ఈ ఐక్యత దేశవ్యాప్తంగా ఉన్న విప్లవ పార్టీల చీలికల వల్ల జరిగన నష్టాన్ని గురించి ఆలోచింపజేస్తుందని గుర్తుచేశారు. కార్యక్రమంలో న్యూడెమోక్రసీ సీనియర్ నాయకుడు కోటేశ్వరరావు, జాతీయ నేతలు వేముపల్లి వెంకటరామయ్య, సాధినేని వెంకటేశ్వరరావు, రాష్ట్ర నాయకులు సాంబశివరావు, జేవీ చలపతిరావు, వెంకటేశ్వర్లు, ప్రసాద్, కే గోవర్ధన్, ఝాన్సీ, వీ సంధ్య, ఆవునూరి మధు, సీఎస్ సాగర్ పాల్గొన్నారు.