Gram Panchayat | హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): గ్రామ పంచాయతీలపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష కట్టింది. గద్దెనెక్కినప్పటి నుంచి పంచాయతీలకు నిధులు విడుదల చేయకుండా కడుపు మాడ్చుతున్న ప్రభుత్వం.. ఇప్పుడు ఏకంగా ఉరి వేస్తున్నది. జిల్లా మొత్తాన్ని ‘అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (పట్టణాభివృద్ధి సంస్థ)’ల కిందికి తీసుకొస్తూ తాజాగా పురపాలకశాఖ ఉత్తర్వులు జారీచేసింది. తద్వారా పంచాయతీల అధికారాలకు కత్తెర వేయడంతోపాటు.. ఆదాయానికి గండికొడుతున్నది. అసలే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న గ్రామ పంచాయతీలకు ప్రభుత్వ నిర్ణయం పిడుగుపాటుగా మారనున్నది. మరోవైపు ప్రభుత్వ నిర్ణయంతో ప్రజలపై భారీగా పన్నుల భారం పెరుగనున్నది. అంతిమంగా సర్కారు తన ఖజానా నింపుకొనేందుకు ప్రజల జేబులు గుల్ల చేసేందుకు సిద్ధమైంది.
ఆదాయం.. అధికారాలకు కత్తెర
గ్రామ పంచాయతీల ప్రధాన ఆదాయ వనరుల్లో ‘అనుమతులు’ కూడా ఒకటి. లేఔట్లు, వెంచర్లు, భవన నిర్మాణాలకు పంచాయతీలు అనుమతులు ఇస్తుంటాయి. ఈ క్రమంలో చదరపు గజాలు, చదరపు అడుగుల లెక్కన ఫీజులు వసూలు చేస్తాయి. తద్వారా పంచాయతీలకు ఆదాయం వస్తుంది. ఇప్పుడు ఈ ఆదాయానికి ప్రభుత్వం గండి కొడుతున్నది. అ ర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోకి వెళ్తే అనుమతుల అధికారం మొత్తం దానికే ఉంటుంది. తద్వారా పంచాయతీలకు రావాల్సిన ఆదాయం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు చేరుతుంది. పంచాయతీల ఫీజులతో పోల్చితే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల్లో ఫీజులు నాలుగైదు రెట్లు ఎక్కువగా ఉంటాయి. దీంతో పంచాయతీల్లో తక్కువ ఫీజులతో అయిపోయే పనులకు ఇప్పుడు ప్రజలు భారీగా చెల్లించుకోవాల్సి వస్తుంది. వారి జేబులకు చిల్లు పడుతుంది. ఇదే సమయంలో ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. అంటే సర్కారు తన ఖజానాను నింపుకోవడానికి ప్రజలపై అదనపు పన్నుల భారం మోపనున్నదన్నమాట. పైగా ఇప్పటివరకు ఊర్లో ఉన్న పంచాయతీ కార్యాలయానికి వెళ్తే పనులు జరిగేవి. కానీ ఇప్పుడు జిల్లాకు ఒకటో.. రెండో ఏర్పాటయ్యే అథారిటీ ఆఫీసుల చుట్టూ తిరిగేందుకు అదనపు సమయం, భారం మోయాల్సి వస్తుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఏ రకంగా చూసినా ప్రజల నడ్డి విరవడం ఖాయమని, పల్లెలను మరింత సంక్షోభంలోకి నెడుతుందని చెప్తున్నారు. వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
నిధులు లేక మూలుగుతున్న పల్లెలు..
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రామాలకు ప్రతినెల రూ.275 కోట్ల చొప్పున ఏటా రూ.3,300 కోట్ల వరకు టంచనుగా నిధులు విడుదల చేసేవారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పల్లెలపై కక్ష కట్టింది. పంచాయతీలకు నిధులు విడుదల చేయకపోవడంతో కనీసం ట్రాక్టర్ డీజిల్, బ్లీచింగ్ పౌడర్ కూడా కొనలేని దుస్థితి నెలకొన్నది. కేంద్రం నుంచి వివిధ పథకాల కింద వచ్చిన రూ.2,100 కోట్ల నిధులను సైతం రా ష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. 15వ ఆర్థిక సంఘం నుంచి వచ్చిన రూ.500 కోట్లను పంచాయతీలకు ఇవ్వకుండా ఆపారని చెప్తున్నారు. పారిశుద్ధ్య పనులు కూడా చేయకపోవడంతో దోమలు, ఇతర కీటకాల సంఖ్య పెరిగి సీజనల్ వ్యాధు లు విజృంభించాయి. మాజీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు తమకు గౌరవ వేతనం కూడా రాలేదని మొత్తుకున్నారు. బిల్లులు పెండింగ్ పెట్టడంతో మాజీ సర్పంచులు లబోదిబోమంటున్నారు. లక్షలు ఖర్చు పెట్టి పనులు చేయించి అప్పులపాలు అయ్యామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చే నెల 4న చలో హైదరాబాద్ కూడా ప్రకటించారు. ఇలా పంచాయతీలు కునారిల్లుతున్న తరుణంలో ప్రభుత్వం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలకు అప్పగించడం ద్వారా పల్లెలకు ఉరివేస్తున్నదని విమర్శిస్తున్నారు.
నారాయణపేటకు అభివృద్ధి అథారిటీ
కొత్తగా నారాయణపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (నుడా) ఏర్పాటైంది. పేట జిల్లా పరిధిలోని నారాయణపేట, కోస్గి, మక్తల్ మున్సిపాలిటీలతోపాటు జిల్లాలోని 245 గ్రామాలతో కలిపి నుడాను ఏర్పాటు చే స్తూ మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్ శనివారం జీవో జారీ చేశారు. దామరగిద్ద మండలంలోని 27 గ్రామాలు, ధన్వాడలో 9, గుండుమాల్లో 10 , కోస్గిలో 15, కొత్తపల్లిలో 11, కృష్ణలో 14, మ ద్దూరులో 17, మాగనూర్లో 20, మక్తల్లో 37, మరికల్లో 14, నారాయణపేటలో 24, నర్వలో 20, ఉటూర్ మండలంలోని 27 గ్రామాలతో నుడా ఏర్పాటు కానున్నది. మొత్తం 280 పంచాయతీలు ఉండగా 245 జీపీలకు నుడాలో చోటు దక్కింది. అలాగే మద్దూరుతోపాటు సమీ ప 8 జీపీలను విలీనం చేసి.. మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది.