హిమాయత్‌నగర్, డిసెంబర్ 26 : ఇటీవల కొడంగల్‌లో సర్పంచుల ఆత్మీయ సమ్మేళనంలో వెలమ సామాజికవర్గాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్‌రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలని ఆల్ ఇండియా వెలమ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈమేరకు హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లోని వెలమ భవన్లో శుక్రవారం విలేకరుల సమావేశంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు తాండ్ర శ్రీనివాస్‌రావు, దివాకర్‌రావు మాట్లాడారు. ఆ సభలో సర్చంచులకు చెప్పాల్సిన అంశాలను కాకుండా వెలమ జాతిని అవమానపరిచేలా మాట్లాడారని, ముఖ్యమంత్రి ఉద్దేశపూర్వకంగా తమను టార్గెట్ చేయడం సబబు కాదని మండిపడ్డారు.
వెలమ జాతిపై నోరుపారేసుకోవడం ఇది మొదటిసారి కాదని, గతంలో నల్లగొండ జిల్లా సంగెంలో మూసీ రివర్‌ఫ్రంట్ సమావేశంలోనూ కించపరిచారని, హైదరాబాద్‌లో ఓ సభలో ‘మీ జాతి.. కలుపు మొక్కలు’ అంటూ వ్యాఖ్యలు చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. అంతేకాదు షాద్‌నగర్ ఎమ్మెల్యే శంకర్‌తో చిలకపలుకులు పలికించి వెలమ జాతిని అంతం చేస్తామన్నారని గుర్తుచేశారు. వెలమ కులస్తులు ఐక్యంగా పోరాడితే ఎమ్మెల్యే శంకర్ క్షమాపణలు చెప్పారని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి రాజకీయ నేతగా కాకుండా ఫ్యాక్షనిస్టులా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తక్షణమే సీఎం వెలమ జాతికి క్షమాపణ చెప్పాలని, లేకపోతే వెలమల పౌరుషం చూపిస్తామని వారు హెచ్చరించారు.