హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): ఢిల్లీలో జరుగుతున్న రెండ్రోజుల ఆలిండియా స్పీకర్స్ కాన్ఫరెన్స్‌ను ఆదివారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ప్రారంభించారు. ఈ సందర్భంగా 1925 ఆగస్టు 24న సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో స్పీకర్‌గా ఎన్నికైన విఠల్‌భాయ్ పటేల్ స్మారకార్థం పోస్టల్ స్టాంపును ఆయన విడుదల చేశారు. అనంతరం దేశంలో శాసనసభల చరిత్రను తెలిపే ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ఈ ఆలిండియా స్పీకర్స్ సమావేశానికి తెలంగాణ నుంచి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ ముదిరాజ్, తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ డాక్టర్ వీ నరసింహాచార్యులు, అధికారులు హాజరయ్యారు. కాగా, ఢిల్లీ అసెంబ్లీ భవనంలో జరుగుతున్న ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా 29 రాష్ర్టాల శాసనసభ స్పీకర్లు, ఆరు రాష్ర్టాల శాసనమండలి చైర్మన్లు, డిప్యూటీ చైర్మన్లు తదితరులు హాజరయ్యారు.