హైదరాబాద్ సిటిబ్యూరో, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ) ఖైరతాబాద్ : నిమ్స్ జనరల్ మెడిసిన్ వైద్యులు తెలంగాణ కీర్తిని చాటారు. నీట్ ఎస్ఎస్2023 ఎంట్రెన్స్ పరీక్షల్లో ఆలిండియా తొలి ర్యాంకుతో పాటు మరిన్ని అత్యుత్తమ ర్యాంకులను కైవసం చేసుకొని జయకేతనం ఎగురవేశారు. నిమ్స్ జనరల్ మెడిసిన్ విభాగం వైద్యులు డాక్టర్ సుబ్రమణియన్ ఆలిండియా మొదటి ర్యాంకు సాధించారు. ఆయనతో పాటు శరత్చంద్ర గౌడ్ 15, అభిషేక్ 32, నవీన్ కుమార్ 35, భాను 49, కీర్తి 58, అభిలాశ్ 356, ఖలీల్ 559, సుగుణ 656, నందిత 796, జాకీర్ 870, దినేశ్ 1199 ర్యాంకులతో అదరగొట్టారు. హైదరాబాద్ మియాపూర్‌కు చెందిన చర్మవ్యాధుల వైద్యనిపుణుడు డాక్టర్ ప్రభాకర్‌రావు, మణి దంపతుల కుమారుడైన సుబ్రమణియన్ తొలి ర్యాంకు సాధించి రాష్ట్ర కీర్తిని దేశానికి చాటి చెప్పారు.
ఆలిండియా మొదటి ర్యాంకుతో పాటు మరో 11 అత్యుత్తమ ర్యాంకులు సాధించిన నిమ్స్ వైద్యులను డైరెక్టర్ డాక్టర్ బీరప్ప అభినందించారు. బుధవారం నిమ్స్‌లో వారిని సత్కరించారు. కార్యక్రమంలో డీన్ లీజా రాజశేఖర్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నిమ్మ సత్యనారాయణ, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కృష్ణారెడ్డి, జనరల్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ నావల్ చంద్ర, ప్రొఫెసర్ రాజు, ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు, డాక్టర్ శెట్టి, డాక్టర్ స్వరూప పాల్గొన్నారు.
నిమ్స్ దేశంలోనే ఒక అత్యుత్తమ సంస్థ. ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ ఉన్నారు. సర్వీస్‌లోనూ, టీచింగ్‌లోనూ మెడికల్ విద్యార్థులకు అన్ని విధాలా సహకరిస్తారు. అన్నిరకాల రోగులు రావడం వల్ల ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా పెరుగుతుంది. ఆలిండియా ఫస్ట్ ర్యాంకు సాధించినందుకు చాలా సంతోషంగా ఉన్నది. నేను కష్టపడి చదివినా మంచి శిక్షణ ఇచ్చిన నిమ్స్‌కు రుణపడి ఉంటా. ఇక ఎండోక్రనాలజి విభాగంలో సూపర్‌స్పెషాలిటీ చేయాలనుకొంటున్నాను. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తాను.
– డాక్టర్ సుబ్రమణియన్ (ఆలిండియా ఫస్ట్ ర్యాంక్ విద్యార్థి)