హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): వచ్చే విద్యాసంవత్సరం ఇంజినీరింగ్ ఫస్టియర్ తరగతులను సెప్టెంబర్ 15లోపు ప్రారంభించాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) సూచించింది. బీటెక్ సెకండియర్‌లో ల్యాటరల్ ఎంట్రీకి కూడా సెప్టెంబర్ 15 తుది గడువు అని పేర్కొన్నది. మంగళవారం 2023 -24 విద్యాసంవత్సరం అకడమిక్ క్యాలెండర్‌ను ఏఐసీటీఈ విడుదల చేసింది. ఇప్పటికే ఇంజినీరింగ్ కాలేజీలకు అనుమతులిచ్చేందుకు ఏఐసీటీఈ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
జూన్ 10లోపు ఈ ప్రక్రియను పూర్తిచేచేసి, కాలేజీలకు అనుమతులివ్వడం/ తిరస్కరించడమో చేస్తామని ఏఐసీటీఈ సభ్యకార్యదర్శి ప్రొఫెసర్ రాజీవ్‌కుమార్ తెలిపారు. కాలేజీలు జూలై 7లోపు వర్సిటీలు/బోర్డుల నుంచి అనుమతులు తెచ్చుకోవాలని సూచించారు. అడ్మిషన్లు రద్దుచేసుకున్న విద్యార్థులు చెల్లించిన ఫీజును మొత్తం వాపస్చేస్తామని వెల్లడించారు.
సాంకేతిక కోర్సులతో పాటు, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ (పీజీడీఎం), పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్ ఇన్ మేనేజ్మెంట్ (పీజీసీఎం) కోర్సుల అకడమిక్ క్యాలెండర్‌ను కూడా ఏఐసీటీఈ విడుదల చేసింది. టీఎస్ ఎంసెట్ ఎగ్జామ్ మే 10 నుంచి 14 వరకు నిర్వహించనున్న విష యం తెలిసిందే. ఫలితాల వెల్లడి తర్వాత జూ న్లోనే ప్రవేశాల షెడ్యూల్‌ను ప్రకటిస్తారు.