TREI-RB | హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ): గురుకులాల్లో ఉద్యోగ నియామక రాత పరీక్షలన్నీ ఆన్లైన్లో నిర్వహిస్తామని తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు (ట్రిబ్) తెలిపింది. ఆయా పోస్టుల పరీక్షలు ఆగస్టు 1 నుంచి 23 వరకు కొనసాగుతాయని వెల్లడించింది. రెండురోజుల్లో పోస్టుల వారీగా తేదీలను ప్రకటిస్తామని పేర్కొన్నది. తొలుత డీఎల్, జేఎల్, పీజీటీ, తదనంతరం ఫిజికల్ డైరెక్టర్, ఆర్ట్ అండ్క్రాఫ్ట్, టీజీటీ పోస్టుల భర్తీకి పరీక్ష తేదీలను ఖరారు చేయనున్నది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల్లో పీజీటీ 1,276, టీజీటీ 4,020, జేఎల్, డీఎల్, పీడీ 2,876, టీజీటీ స్కూల్ లైబ్రేరియన్ 434, స్కూల్ పీడీ 275, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ 226, మ్యూజిక్ టీచర్ 124 పోస్టుల భర్తీకి గత నెల 27 వరకు ట్రిబ్ దరఖాస్తులను స్వీకరించింది. మొత్తం 9,231 పోస్టులకు మొత్తం 2,63,045 దరఖాస్తులు వచ్చాయని వెల్లడించింది.
పకడ్బందీ నిర్వహణకు ప్రణాళికలు
గురుకుల నియామక ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు ట్రిబ్ చర్యలు చేపట్టింది. పరీక్ష తేదీల ఖరారు, ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, అవాంచనీయమైన సంఘటనలు చోటుచేసుకోకుండా అనుసరించాల్సిన ప్రణాళికల రూపకల్పనలో నిమగ్నమైంది. ఇటీవలనే రద్దు చేసిన పరీక్షల నిర్వహణ రీషెడ్యూల్‌ను టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆ పరీక్ష తేదీలతో ఎక్కడా గురుకుల పరీక్ష తేదీలకు ఇబ్బంది కలగకుండా చూస్తున్నది. అదేవిధంగా ఇతర జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షల తేదీలను కూడా ట్రిబ్ ఆరా తీస్తున్నది. త్వరలోనే అన్ని గురుకులాల సభ్యులతో ట్రిబ్ సమావేశమై, షెడ్యూల్ ఖరారు చేయనున్నది.