Exams Postpone | హైదరాబాద్ : భారీ వర్షాల కారణంగా ఉస్మానియా, కాకతీయ, పాలమూరు యూనివర్సిటీల పరిధిలో జరగాల్సిన పలు పరీక్షలు వాయిదా పడ్డాయి. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో శనివారం నిర్వహించాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేసినట్లు ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యాసంస్థలకు ఇచ్చిన రెండు రోజుల సెలవులను శనివారానికి కూడా పొడగిస్తూ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. పరీక్షలను తదుపరి నిర్వహించే తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు.
వరంగల్ కాకతీయ యూనివర్సిటీ పరిధిలో శనివారం జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేసినట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. జులై 20 నుంచి 22 మధ్య వాయిదా పడిన పరీక్షల షెడ్యూల్ను శనివారం సాయంత్రం వరకు వెల్లడిస్తామని పేర్కొన్నారు.
వర్షాల దృష్ట్యా పాలమూరు యూనివర్సిటీ పరిధిలో కూడా ఈ నెల 22న జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశారు. వాయిదా పడ్డ పరీక్షల తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని వర్సిటీ అధికారులు తెలిపారు.