Saritha Vs Bandla | మహబూబ్‌నగర్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): గద్వాల అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఫిరాయింపు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి గుదిబండగా మారారా? సీఎం రేవంత్‌రెడ్డికి తప్ప కాంగ్రెస్ నాయకులు, శ్రేణుల్లో ఇదే అభిప్రాయం వ్యక్తమవుతుందా? బండ్లపై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన సరితకే మళ్లీ హస్తం టికెట్ ఇవ్వాలని వారంతా డిమాండ్ చేస్తున్నారా? బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిపై పార్టీలో ఉన్న అసంతృప్తిని చల్లార్చే ధైర్యం అధిష్ఠానం చేయబోదా? అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ గుర్తుపై ఎమ్మెల్యేగా గెలుపొంది కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన మహబూగ్నగర్ జిల్లా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్న చందంగా మారిందని రాజకీయ విశ్లేషకులే అభిప్రాయపడుతున్నారు. అధికార హవా, పైరవీల రాజ్యం కోసం పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సుప్రీం ఆదేశంతో ఫిరాయింపు ఎమ్మెల్యేలు అందరిదీ ఇదే పరిస్థితిలా మారింది. గద్వాలలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఉప ఎన్నిక అంటూ వస్తే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిని బండకేసి కొట్టుడేనని కాంగ్రెస్ శ్రేణులే బహిరంగంగా తెగేసి చెప్తున్నాయి.
ఈ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి సహా ఎవరు చెప్పినా తమ నిర్ణయం లో రవంత కూడా మార్పు ఉం డదని ఆ పార్టీ వర్గాలు ఇప్పటి నుంచే తేల్చి చెప్తున్నాయి. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిననప్పటి నుంచి ఇప్పటి దాకా గద్వాల నియోజకవర్గంలో పలుమార్లు అసలు, వలస కాంగ్రెస్ నేతల మధ్య పలుమార్లు రసాభాస చోటు చేసుకోవడం గమనార్హం. గాంధీభవన్ కూడా అందుకు సాక్ష్యంగా నిలిచింది. కండువా మార్చిన రోజే తన రాజకీయ జీవితం కతమైపోయినట్టేనని ఇతరుల కన్నా ముందే ఆయనే అంచనా వేసుకున్నారని కాంగ్రెస్ శ్రేణులే ఎద్దేవా చేస్తున్నాయి. అందులో భాగంగానే ‘నేనింకా బీఆర్ఎస్లోనే ఉన్నాను. నా ఇంట్లో.. ఆఫీసులో కేసీఆర్ ఫొటోనే ఉన్నది’ అన్న ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలనే వారు గుర్తుచేస్తున్నారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి ఉన్న ప్రజాబలం, తమ అధినేత కేసీఆర్‌పై నియోజకవర్గంలో ఉన్న ఆదరణను మరోసారి సొమ్ముచేసుకోవాలనే కుట్రలో భాగంగానే బండ్ల సరికొత్త డ్రామాలకు తెరలేపారని బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. కేసీఆర్ టికెట్ ఇచ్చి ఆదరిస్తే కృష్ణమోహన్‌రెడ్డి మోసం చేసి కాంగ్రెస్‌లో చేరారని, సమయం కోసం ఎదురు చూస్తున్నామని గులాబీ శ్రేణులు హెచ్చరిస్తున్నాయి. నిజానికి, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిపై ప్రజలు, బీఆర్ఎస్ పార్టీ స్పష్టమైన నిర్ణయానికి వచ్చారని తేలిపోయింది.
అసలు కాంగ్రెస్‌పై బండ్ల అణచివేత ధోరణి
కాంగ్రెస్ పార్టీలో చేరిన నాటి నుంచే ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి.. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి సరిత, ఇతర అసలు కాంగ్రెస్ నేతలపై అణచితేవ ధోరణిని ప్రదర్శిస్తూ వచ్చారు. 2023లో అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా సరిత పోటీచేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అవకాశం ఇస్తే ఎమ్మెల్యేగా గెలిచిన కృష్ణమోహన్‌రెడ్డి.. కొన్నాళ్లకే సీఎం రేవంత్‌రెడ్డి మాటతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆనాటి నుంచే ఆధిపత్యాన్ని చెలాయించడం మొదలుపెట్టారు. అధికార యంత్రాంగాన్ని తన చెప్పు చేతల్లో ఉంచుకోవడమే కాకుండా తన ప్రత్యర్థి సరిత కానీ, ఆమె వర్గీయులు ఎవరైనా.. ఎటువంటి పనుల కోసం వచ్చినా చేయొద్దని హుకుం జారీచేశారు. అంతటితో ఆగకుండా అసలు ఆమె నుంచి నియోజకవర్గ ఇన్చార్జి పదవిని తొలగించాలని పార్టీపై ఒత్తిడి తేవడం మొదలుపెట్టారు. ఆ ఒత్తిడి కాస్తా అణిచివేతకు దారితీసిందని, ఆ చర్యల నుంచే తాడోపేడో తేల్చుకుందామని నియోజకవర్గంలోని అసలు కాంగ్రెస్ శ్రేణులు గాంధీభవన్‌ను ముట్టడించిన ఉదంతాలు ఉన్నాయి.
ఇరువర్గాల మధ్య పచ్చగడ్డి వేయకున్నా సరే భగ్గుమనేలా పరిస్థితులు మారాయి. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే తమ అస్తిత్వాన్నే లేకుండా చేయాలని బాహాటంగానే కుట్రలు చేస్తున్నప్పుడు తామెందుకు కృష్ణమోహన్‌రెడ్డి చర్యలను ఉపేక్షించాలని సరిత, ఆమె వర్గీయులు ప్రత్యక్ష కార్యాచరణకు దిగారు. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇతర నియోజకవర్గాల కన్నా గద్వాలలో పార్టీ కార్యక్రమాలను ఎవరికి వారుగా నిర్వహిస్తున్నారు. గాంధీభవన్ సహా పార్టీ అధిష్ఠానం నుంచి నియోజకవర్గానికి వచ్చే పరిశీలకులు వేర్వేరుగా నిర్వహించే సమావేశాలకు వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయంటేనే గద్వాల పరిస్థితి ఏ స్థాయికి వెళ్లిందో తెలిసిపోతుంది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు బీఫాం ఇవ్వకంటే గద్వాల టు గాంధీభవన్ పాదయాత్ర చేస్తామని నియోజకవర్గ ఇన్చార్జి సరిత హెచ్చరికలు జారీచేశారు. ఈ తరుణంలో సుప్రీంకోర్టు ఆదేశం సరిత వర్గానికి పదునైన ఆయుధాన్ని ఇచ్చినట్టు అయిందని కాంగ్రెస్ శ్రేణుల్లో జోరుగా చర్చ సాగుతున్నది.
సరితకు టికెట్ ఇవ్వకుంటే కాంగ్రెస్ ఖతమే!
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపడితే ఉప ఎన్నికలు ఖాయమనే వాతావరణం నెలకొన్నది. దీంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేసిన సరితకే మళ్లీ టికెట్ ఇవ్వాలని, ఆమె వర్గీయులు ఇప్పటి నుంచే ఒత్తిడి చేస్తున్నారు. ఈ మేరకు ఆమె కూడా తన ప్రయత్నాలను ముమ్మరం చేశారని చెప్తున్నారు. కాంగ్రెస్‌లో చేరినప్పటి నుంచి ఇప్పటి దాకా జరిగిన పరిణామాలన్నింటినీ కృష్ణమోహన్‌రెడ్డి రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయని ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు. ఇటువంటి వాతావరణాన్ని అంచనా వేయకుండా సీఎం మాటలు వినో, మరెవరి మాటలు వినో టికెట్ కేటాయిస్తే కాంగ్రెస్ పార్టీకి నియోజకవర్గంలో శాశ్వత సమాధి ఖాయమని గాంధీభవన్ వర్గాలు గుసగుసలాడుతుండటం గమనార్హం.