యాదాద్రి భువనగిరి, మే 25 (నమస్తే తెలంగాణ): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయం వద్ద భక్తులకు మరిన్ని సదుపాయాలు కల్పించేందుకు దేవస్థానం చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే సేవలన్నీ ఆన్లైన్లో అందుబాటులో ఉంచింది. అందరికీ ఆన్లైన్లో బుక్ చేసుకోవడం సాధ్యం కానివారి కోసం కొండ కింద టెంపుల్ బస్టాండ్ వద్ద ఇంటిగ్రేటెడ్ బుకింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఇక్కడే కైంకర్యాలు, సుప్రభాతం, బ్రేక్ దర్శనం, వ్రతాలు, వాహన పూజ, వీఐపీ దర్శనం, సువర్ణపుష్పార్చన తదితర సేవలకు సంబంధించి టికెట్లను పొందవచ్చు. జిల్లా బస్సులో ఆర్టీసీ బస్టాండ్‌లో దిగగానే.. దాని వెనకాలే ఉన్న టెంపుల్ బస్టాండ్‌కు నడుచుకుంటూ క్షణాల్లోనే చేరుకోవచ్చు. ఇక్కడే అవసరమైన వివిధ సేవల టికెట్లు కొనుగోలు చేసుకునే సదుపాయం ఉంటుంది. పక్కనే కల్యాణకట్ట, పుష్కరిణి ఉంటుంది. టెంపుల్ బస్టాండ్‌లో ఉచిత బస్సు సౌకర్యం ఉండటంతో అక్కడి నుంచి నేరుగా గుట్టపైకి చేరుకుంటారు.
ప్రత్యేకంగా ఇన్ఫర్మేషన్ సెంటర్
ప్రస్తుతం టెంపుల్ బస్టాండ్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ పనులు పూర్తికాగానే వివిధ రకాల సేవలను అందుబాటులోకి రానున్నాయి. టెంపుల్ బస్టాండ్‌లో ఇన్ఫర్మేషన్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. దర్శనం కోసం వచ్చే భక్తులకు అవసరమైన సమాచారం ఇవ్వనున్నారు.