హైదరాబాద్, సెప్టెంబర్27 (నమస్తే తెలంగాణ): ముంపు నేపథ్యంలో తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్ నిర్మాణానికి మహారాష్ట్ర సర్కారు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేసిందని గజ్వేల్ ఈఎన్సీ, కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీ హరిరాం వెల్లడించారు. ఎఫ్‌ఆర్‌ఎల్‌ను 152 మీట ర్ల నుంచి 148కి తగ్గించాలని కోరడంతో ప్రాజెక్టునే మరోసారి పునఃసమీక్షించాలని కోరిందని, అందుకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకున్నదని వివరించారు. ఉన్నతస్థాయి సమావేశాల అనంతరం ప్రాజెక్టు రీడిజైన్ చేశారని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటైన జస్టిస్ ఘోష్ కమిషన్ శుక్రవారం నిర్వహించిన బహిరంగ విచారణకు హరిరాం హాజరయ్యారు. ప్రాజెక్టు రూపకల్పన, కార్పొరేషన్ ఏర్పాటు, బ్యాంకుల నుంచి రుణాల సేకరణ, బిల్లుల చెల్లింపు అంశాలపై జస్టిస్ ఘోష్ అడిగిన ప్రశ్నలకు సూ టిగా, స్పష్టంగా సమాధానాలు ఇచ్చారు. 2.30 గంటలపాటు విచారణ కొనసాగగా, 90కిపైగా ప్రశ్నలు అడిగారు. ప్రాజెక్టు రూపకల్పనకు సంబంధించిన అంశాలను హరిరాం వివరించారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై 2015 ఫిబ్రవరిలో మహారాష్ట్ర, తెలంగాణ సీఎంల మధ్య అత్యున్నతస్థాయి సమావేశం కొనసాగిందని వివరించారు. తుమ్మిడిహట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో బరాజ్‌ను నిర్మిస్తే 3,700 ఎకరాలకు ముంపు సమస్య ఉన్నద ని, ఎత్తును 148కి తగ్గించాలని మహారాష్ట్ర సీఎం, తెలంగాణ సీఎంను కోరారని, మొత్తం ప్రాజెక్టునే మరోసారి సమీక్షించాలని విజ్ఞప్తి చేశారని వెల్లడించారు. దీంతో తెలంగాణ సర్కారు అనేక చర్చలు కొనసాగించి, ఆ తరు వాత ప్రాజెక్టును రీడిజైన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చారని కమిషన్‌కు వివరించారు.
కాళేశ్వరం ప్రాజెక్టును వేగంగా నిర్మించేందుకు, అవసరమైన నిధులకు కొరత లేకుండా చూసేందుకు ప్రభుత్వం కాళేశ్వరం ఇరిగేషన్ కార్పొరేషన్ లిమిటెడ్‌ను ఏర్పాటు చేసిందని హరిరాం తెలిపారు. ప్రభుత్వ గ్యారెంటీలతోనే రుణాలను సేకరించామని, నిబంధనల మేరకే బిల్లుల చెల్లింపు కొనసాగిందని వివరించారు. కార్పొరేషన్ ఆర్థిక వ్యయాల మదింపునకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఇంటర్నల్ ఆడిటర్‌ను నియమించిందని, కాగ్ సైతం ఆర్థిక సంవత్స రం వారీగా ఆడిటర్లను నియమిస్తూ మదింపు చేయిస్తున్నదని వెల్లడించారు. ఇప్పటివరకు వడ్డీతో కలిపి రూ.87,449 కోట్ల రుణం మం జూరైందని తెలిపారు. వాటిలో బ్యాంకుల నుంచి రూ.64 వేల కోట్లు విడుదల కాగా, ఏ జెన్సీలకు చెల్లింపులు చేశామని వివరించారు. రూ.29,737 కోట్లు రీ పేమెంట్ చేశామని తెలిపారు. కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా రుణం నుంచే రూ.10వేల కోట్లను పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ (పీఆర్ఎల్ఐఎస్) నిర్మాణ పనుల కోసం వెచ్చించామని తెలిపా రు. ఈ సందర్భంగా కాళేశ్వరం కార్పొరేషన్ బ్యాలెన్స్‌షీట్, వార్షిక నివేదికలు, ఆడిట్ రిపోర్టులు, వర్క్బిల్లను అందజేయాలని ఈఎన్సీ హరిరాంకు కమిషన్ సూచించింది. శనివారం కూడా విచారణ కొనసాగుతుంది.