Group-1 Prelims | హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలకు ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే నిర్వహించనున్నారు. ఇన్ సర్వీసు ఉద్యోగులు, అభ్యర్థులు కోరినట్టుగా పరీక్షను వాయిదా వేయలేదు. ఈ విషయంలో హైకోర్టు కూడా టీజీపీఎస్సీ అధికారులకే నిర్ణయం వదిలేసినట్టు సమాచారం.
దీంతో ప్రకటించిన తేదీనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈనెల 9న నిర్వహించనున్న పరీక్ష నిర్వహణకు సర్వం సిద్ధం చేసినట్టు అధికారులు తెలిపారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు 897 పరీక్ష కేంద్రాల్లో 4.03 లక్షలమంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. ఉదయం 10 గంటలకే కేంద్రాల గేట్లు మూసివేస్తారు. పది తర్వాత ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించబోమని అధికారులు పేర్కొన్నారు. అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్లోడ్ ప్రక్రియ కొనసాగుతున్నది. పరీక్షలకు సంబంధించిన మార్గదర్శకాలు టీజీపీఎస్సీ వెబ్సైట్లో ఉంచారు.