హైదరాబాద్, ఆగస్ట్ 20 (నమస్తే తెలంగాణ): కర్ణాటక ప్రభుత్వంలో డీకే శివకుమార్ పాత్రను తెలంగాణలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పోషిస్తున్నాడని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన అసెంబ్లీలో మీడియాతో మాట్లాడారు. పొంగులేటి ఢిల్లీలో పావులు కదుపుతున్నారని, దానిని చూస్తుంటే ఇంకేదో పదవి ఆశిస్తున్నారని అనుమానం కలుగుతున్నదని చెప్పారు. సీఎంను కాదని కొడంగల్ అభివృద్ధి కాంట్రాక్టు పొంగులేటికి రావడమే ఇందుకు ఉదాహరణ అని చెప్పారు. మంత్రి కంపెనీకి ప్రభుత్వ కాంట్రాక్టు రావడం చరిత్రలో ఎన్నడూ లేదని గుర్తుచేశారు. ఈ ప్రాజెక్టుపై తమకు అనుమానాలున్నాయని చెప్పారు. పొంగులేటి వెంట కొంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారని భయపడి కాంట్రాక్టు ఇచ్చారా? అని ప్రశ్నించారు.
ఇందుకు సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. లేదా పొంగులేటి కన్ను సీఎం పీఠంపై పడిందని కాంట్రాక్టు ఇచ్చారా? అని ప్రశ్నించారు. ఏ కారణంతో ఏఐసీసీ నుంచి ముఖ్యమంత్రిపై ఒత్తిడి చేసి పొంగులేటి కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చారో సమాధానం చెప్పాలని నిలదీశారు. ఢిల్లీలో కప్పం కట్టేందుకు కాంట్రాక్టులు ఇవ్వడం కరెక్టు కాదని విమర్శించారు. ఈ విషయాలన్ని స్వయంగా తనకు ఓ మంత్రి చెప్పారని తెలిపారు. దీనిని బట్టి ప్రభుత్వంలో భట్టి విక్రమార రెండో స్థానంలో లేరని అర్థమవుతున్నదని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనలో తీసుకొచ్చిన వేలకోట్లు ఎప్పుడు వస్తాయి? ఎంత మందికి ఉద్యోగాలు వస్తాయి? ప్రభుత్వం తరఫున ఇన్ఫ్రాస్ట్రక్చర్కు ఎంత ఖర్చవుతుంది? అనే విషయంలో స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌చేశారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నదని మీడియాలో చూశానని, నిజ నిర్ధారణ చేసుకోవాల్సిన బాధ్యత ఆయనపై ఉన్నదని చెప్పారు.