Sarpanch Elections | యాదగిరిగుట్ట, డిసెంబర్ 9: ‘నేను ఎమ్మెల్యేను.. అధికారం మాచేతుల్లో ఉన్నది.. మీరు ఎవరికి ఓటేశారో నాకు తెలుస్తది.. పోలింగ్ డబ్బాలో చూస్తా’ అంటూ ఆలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఓటర్లకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ‘నా సొంతూరు సైదాపురంలో ఒక్క వార్డు ఓడిపోతే నేను ఓడిపోయినట్టే’ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మంగళవారం యాదగిరిగుట్ట మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో తన సొంతూరైన సైదాపురంలో కార్నర్ మీటింగ్‌లో మాట్లాడుతూ.. బెదిరింపులకు పాల్పడ్డారు. ‘సైదాపురం నా సొంత గ్రామం. మీరంతా మా కుటుంబ సభ్యులే. కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి గెలుస్తాడని సర్వేలన్నీ చెప్తున్నాయి.
అభ్యర్థి గెలుపు లాంఛనమే’ అని పేర్కొన్నారు. కొంతమంది కిరికిరిగాళ్లు ఇండ్లల్లోకి వచ్చి ఓట్లను అడుగుతున్నారని మండిపడ్డారు. గ్రామంలో కాంగ్రెస్ సర్పంచ్ ఉంటేనే అభివృద్ధి చేస్తానని తెగేసి చెప్పారు. ‘ఒక్క వార్డు ఓడిపోయినా నేను ఓడిపోయినట్టే. ఒక్క ఓటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి వేసినా నామీద ఒట్టే. వీరభద్ర స్వామిమీద ఒట్టేసి చెబుతున్నా. ఒక్కొక్కడి పని చెప్తా, వాళ్ల తాటతీస్తా. నా ఇంటికి వస్తరు. పనులు చేయించుకుంటరు. నాపైనే పోటీకి దిగుతారా? గుర్తు పెట్టుకోండి, నా గడపను తొక్కనియ్య’ అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో సైదాపురం గ్రామానికి హామీల వర్షం కురిపించారు. సొంత నిధులతో ఫంక్షన్ హాల్ నిర్మిస్తానని, సంక్రాంతి వరకు మరో 70 ఇందిరమ్మ ఇం డ్లను మంజూరు చేస్తానని హామీనిచ్చారు.
బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిపై కాంగ్రెస్ దాడి
బీఆర్ఎస్ తరపున ఎన్నికల బరిలో నిలబడిన సర్పంచ్ అభ్యర్థిపై కాంగ్రెస్ నాయకులు దాడి చేసిన ఘటన ములుగు జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై ములుగు మండలం జంగాలపల్లి సర్పంచ్ అభ్యర్థి ముడుతనపల్లి మోహన్ ములుగు పోలీస్ స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా మోహన్ మాట్లాడుతూ సోమవారం రాత్రి జంగాలపల్లి పరిధిలోని 12వ వార్డు రాంనగర్లో ప్రచారం చేస్తున్న క్రమంలో కాంగ్రెస్‌కు చెందిన కొంతమంది గుండాలు కత్తులు, గడ్డపారలు పట్టుకొని తనపై దాడి చేశారని తెలిపారు. ఈ దాడిలో తీవ్రగాయాలు కాగా రాత్రి దవాఖానలో చేరినట్టు వెల్లడించారు. ఎన్నికల ప్రచారాన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్ గూండాలు భౌతిక దాడికి పాల్పడి వాళ్లే వచ్చి పోలీస్ స్టేషన్లో తనపై ఫిర్యాదు చేశారని ఆరోపించారు. దాడి చేసిన వారిపై ములుగు పోలీస్‌స్టేషన్‌లో సైతం ఫిర్యాదు చేశానని చెప్పారు. దాడిచేసిన వ్యక్తులపై గతంలో పలు కేసులు ఉన్నా పోలీసులు వారిని బైండోవర్ చేయలేదని తెలిపారు. తనపై దాడికి పాల్పడిన రాంనగర్ వార్డు సభ్యుడిగా పోటీ చేస్తున్న కాసర్ల రాజశేఖర్, బంజరుపల్లికి చెందిన బొడిగె భిక్షపతి, జంగాలపల్లికి చెందిన కర్నె రతన్, తొర్రి ఓదెలు, పిట్టల సారయ్య, వేల్పుల రాజేశ్, భీమగాని రాజమౌ ళి, కూనూరు రాజేశ్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల కమిషన్, అధికారులు స్పందించి జంగాలపల్లిలో ప్రశాంతంగా ఓటింగ్ జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.