సంస్థాన్ నారాయణపురం, జనవరి 24: రాష్ట్రం మొత్తం ఒకే మద్యం పాలసీ అమలు కావాల్సి ఉండగా మునుగోడులో మాత్రం ఎక్సైజ్ అధికారులు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చెప్పిన రూల్స్ పాటిస్తున్నారు. ఎక్సైజ్ అధికారులు నిబంధనల ప్రకారం విధులు నిర్వహిస్తున్నారా? లేక ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి దగ్గర పనిచేస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొన్నది. మద్యం షాపులు ఉదయం పది నుంచి రాత్రి పది గంటల వరకు తెరిచి ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయి.
మునుగోడులో మాత్రం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి పదిగంటల వరకు వైన్స్ షాపులు తెరువాలని, పర్మిట్ రూమ్‌లో సిట్టింగ్ సాయంత్రం ఆరు నుంచి రాత్రి పది వరకే నడిపించాలని హుకుం జారీచేశారు. దీంతో ఎక్సైజ్ అధికారులు ఎమ్మెల్యేకు ఎదురు చెప్పకుండా ఆయన చెప్పిన రూల్స్ ప్రకారం మద్యం షాపులు నడిపిస్తుండటం విమర్శలకు తావిస్తున్నది.
ఎమ్మెల్యే ఆదేశాలు పాటిస్తే తీవ్రంగా నష్టపోతామని భావించిన మద్యం షాపు యజమానులు ఉదయం 10 గంటలకు వైన్స్‌లు తెరుస్తున్నారు. అయితే ఎమ్మెల్యే అనుచరులు మాత్రం వైన్స్ నిర్వాహకులను బెదిరిస్తూ బలవంతంగా షాపులు బంద్ చేయిస్తున్నారు. ఎక్సైజ్ శాఖ అధికారులు రెండు రోజులు ఉదయం పది గంటలకు తూతూ మంత్రంగా వైన్స్ షాపులు తెరిపించారు. ఎమ్మెల్యే అనుచరులు షాపులపై దాడులకు దిగడంతొ అడ్డుకోవాల్సిన ఎక్సైజ్ అధికారులు వారికి సరెండర్ అయ్యారు. ఎమ్మెల్యే, ఎక్సైజ్ అధికారుల తీరుతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని వైన్స్ షాప్ నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు.